పూర్తిస్థాయి నీటిమట్టానికి ‘రామడుగు’
ఎస్సారెస్పీ, నిజాంసాగర్, పోచారం ప్రాజెక్టుల్లోకి ఇన్ఫ్లో
ప్రధాన కాలువ ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల
నిజాంసాగర్/నాగిరెడ్డిపేట్/మెండోరా (ము ప్కాల్) ఆగస్టు 27: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో కొనసాగుతుండడంతో నీటి మ ట్టం పెరుగుతున్నదని నీటి పారుదల శాఖ ఏఈ శివకుమార్ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 565 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుందన్నా రు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు (17.80 టీఎంసీలు) గాను శుక్రవారం సాయంత్రానికి 1398.18 అడుగుల (9.50 టీఎంసీలు) నీటి నిల్వ ఉంది. సింగీ తం, కళ్యాణి ప్రాజెక్టులు సైతం పూర్తిస్థాయి నీటి మట్టంతో ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో కురిసిన వర్షాలకు నల్లవాగు మత్తడి పొంగిపొర్లుతున్నది. జుక్కల్ మండలంలోని కౌలాస్నాలా ప్రాజెక్టు 458.00 మీటర్లు 1.237 టీఎంసీల నీరు నిలువ ఉండగా 938 క్యూసెక్కుల ఇన్ఫ్లోగా వస్తున్నది. అంతే స్థాయిలో మూడు వరద గేట్ల ద్వారా నీటిని దిగువకు వి డుదల చేస్తున్నట్లు డీఈఈ దత్తాత్రి తెలిపారు.
పోచారంలోకి 154 క్యూసెక్కులు
నాగిరెడ్డిపేట్ మండలంలోని పోచారం ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో కొనసాగుతున్నట్లు ఇరిగేషన్ డీఈఈ వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టులోకి 154 క్యూసెక్కుల వరద వచ్చి చే రుతున్నట్లు ఆయన తెలిపారు.
ఎస్సారెస్పీలోకి 8,615 క్యూసెక్కులు
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో కొనసాగుతున్నదని ఈఈ చక్రపాణి తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 8,615 క్యూసెక్కుల వరద వస్తున్నదన్నారు. ప్రాజెక్టు ప్రధాన కాల్వల ద్వారా జెన్కోకు 7,500 క్యూసెక్కులు, లక్ష్మీకాలువకు 180, సరస్వతీ కాలువకు 800, గుత్ప ఎత్తిపోతలకు 135 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091అడుగులు (90.313 టీఎంసీలు)కాగా శుక్రవారం సాయంత్రానికి 1090.9 అడుగుల (89.763 టీఎంసీల) నీటినిల్వ ఉంది.