లింగంపేట, ఏప్రిల్27: మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టిన దుకాణాల సముదాయాలను వారం రోజుల వ్యవధిలో వ్యాపారులకు అప్పగించాలని జిల్లా సహకార సంఘం అధికారి వసంత తెలిపారు. 2019 సంవత్సరంలో నిర్మాణ పనులు కొనసాగుతున్న సమయంలో అప్పటి పాలకవర్గ సభ్యులు బహిరంగ వేలం నిర్వహించి వ్యాపారులకు దుకాణాలు కేటాయించారు. 40 దుకాణాలకు వేలం నిర్వహించడంతో రూ.94.26లక్షల ఆదాయం సమకూరింది. సుమారు రెండు కోట్లతో 40 గదుల నిర్మాణం చేపట్టారు. వేలం నిర్వహించి సంవత్సరం గడిచినా గదులు అప్పగించకపోవడంతో వ్యాపారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా మంగళవారం డీసీవో సందర్శించి వివరాలు సేకరించారు. 40 దుకాణాలకు నిర్వహించిన వేలంలో రూ.94.26లక్షలకు రూ.53.67లక్షలు వ్యాపారులు చెల్లించారని, మిగిలిన డబ్బులు రావాల్సి ఉందని సీఈవో సందీప్ డీసీవోకు వివరించారు. సంవత్సరానికి పైగా గదులు అప్పగించని కారణంగా వడ్డీ భారం మోస్తున్నట్లు వ్యాపారులు డీసీవోకు మొరపెట్టకున్నారు. డబ్బులు పూర్తిగా చెల్లించిన వ్యాపారులకు గదులు అప్పగించడంతోపాటు మిగిలిన వారి నుండి డబ్బులు వసూలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా దుకాణం షటర్ తాళాలు పగులగొట్టి నారాగౌడ్‌కు మూడు దుకాణాలు అప్పగించారు. డీసీవో వెంట సహకార సంఘం చైర్మన్ దేవేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ మాకం రాములు, సీఈవో సందీప్, డైరెక్టర్లు ఉన్నారు.