మాటతప్పని సీఎం కేసీఆర్లబ్ధిదారుల సంబురాలు
సెలూన్ల కరెంటు బిల్లు చెల్లింపు
నాయీబ్రాహ్మణులకు నాలుగు నెలల కరెంటు బిల్లును చెల్లించిన ప్రభుత్వం
కరోనా కష్టకాలంలోనూ మాట తప్పని సీఎం కేసీఆర్
కామారెడ్డి జిల్లాలో718 దుకాణాలకు కోటీ 98 లక్షలు చెల్లించిన ప్రభుత్వం
నాయీబ్రాహ్మణులకు కేసీఆర్ ఇచ్చిన మాట అమల్లోకి వచ్చింది. కరోనా కష్టకాలంలో వారికి అండగా నిలుస్తూ.. ఏప్రిల్-జూలై నాలుగునెలల కరెంటు బిల్లును ప్రభుత్వమే పూర్తిగా చెల్లించింది. కామారెడ్డి జిల్లాలో 718 షాపులకు ఈ కరెంటు రాయితీ వర్తించగా.. రూ.1.98కోట్ల బిల్లును ప్రభుత్వమే విద్యుత్‌శాఖకు చెల్లించింది.
నాయీబ్రాహ్మణుల కల నెరవేరింది. ఇప్పటికే పలు పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్రంలోని కులవృత్తులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం తాజాగా వారికి ఇచ్చిన హామీ మేరకు నిధులు మంజూరు చేసింది. సీఎం కేసీఆర్ చెప్పినట్లే విద్యుత్ బిల్లులు మాఫీ చేయడంతో నాయీబ్రాహ్మణ లోకం సంబురపడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొండంత భరోసానిస్తున్నదని వేడుకలు
చేసుకుంటున్నది.
కామారెడ్డి జిల్లాలో 718 మంది నాయీబ్రాహ్మణ కుటుంబాలు కులవృత్తిపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయి. కరోనా నేపథ్యంలో వారి క్లిష్ట పరిస్థితులను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం కరెంటు బిల్లు మాఫీకి సన్నద్ధమైంది. దానిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న 207 కమర్షియల్, మిగిలిన డొమెస్టిక్ కరెంటు మీటర్ల ద్వారా వచ్చిన బిల్లులు సర్కార్ చెల్లించేలా చర్యలు తీసుకున్నది. జిల్లాలో రూ.2,18, 289ను విద్యుత్ శాఖకు బిల్లులో భాగంగా చెల్లించినట్లు బీసీ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు.
మాఫీ కానున్న కోటీ 98లక్షల కరెంటు బిల్లులు
కరోనా కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతూ కులవృత్తిపై ఆధారపడి దుకాణాలు నడుపుకొంటున్న వారికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల్లో దుకాణాలు సరిగ్గా నిర్వహించలేదు. దీంతో దుకాణాలకు వచ్చిన కరెంటు బిల్లులు నాయీబ్రాహ్మణులకు భారం కావొద్దనే ఉద్దేశంతో నాలుగు నెలల బిల్లులను మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో సుమారు వెయ్యి దుకాణాల లబ్ధిదారులకు కోటీ 98 లక్షల రూపాయలు కరెంటు బిల్లుల మాఫీకి సర్కారు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా 718మందికి సంబంధించిన బిల్లులు మాఫీ చేయగా, మరో 300మంది దరఖాస్తు చేసుకున్నట్లు సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు.
నాయీబ్రాహ్మణులకు చేయూత
దారిద్య్రరేఖకు దిగువన ఉన్న నాయీబ్రాహ్మణ కుటుంబాలు గ్రామాల్లో తమ జీవనోపాధి పెంపొందించుకునేలా దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు చేయూతనందిస్తున్నది. అందులో భాగంగా దరఖాస్తు చేసుకున్న 267మంది లబ్ధిదారులకు రూ.50వేల చొప్పున సుమారు కోటీ34లక్షలు అందజేశారు.
మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్
కరోనా కష్టకాలంలో నాయీబ్రాహ్మణుల దుకాణాల నాలుగు నెలల కరెంటు బిల్లులు ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం చెప్పిన మాటను నిలబెట్టుకున్నారు. గ్రామాల్లో టేలాలు పెట్టుకొని సొంతంగా పనిచేసుకునేలా ఒక్కో లబ్ధిదారునికి రూ.50వేలు అందించింది. మాకు కొండంత ఆసరాగా ఉంటున్న సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
నాలుగు నెలల బిల్లులు మాఫీ చేసింది..
సెలూన్ల నాలుగు నెలల కరెంటు బిల్లులు ప్రభుత్వం మాఫీ చేసింది. ఇప్పటికే రూ.2లక్షల18వేల రూపాయల కరెంటు బిల్లులు విద్యుత్ శాఖకు చెల్లించాం. దుకాణాలు పెట్టుకునేందుకు దరఖాస్తు చేసుకున్న 267మంది లబ్ధిదారులకు నిధులు మంజూరు చేశాం.
సీఎం, స్పీకర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం
కోటగిరి, ఆగస్టు 26 : తమ అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని, ప్రభుత్వానికి రుణపడి ఉంటామని నాయీబ్రాహ్మణులు అన్నారు. సెలూన్లకు ఉచిత విద్యుత్ సరఫరాపై హర్షం వ్యక్తం చేస్తూ గురువారం మండల కేంద్రంలో నాయీబ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు చెంపావార్ దయానంద్, కార్యదర్శి సాయిలు, కోశాధికారి రాము, ఉపాధ్యక్షుడు విఠల్. సభ్యులు సాయిలు, ఈర్వంత్, హన్మాండ్లు, రాజేశ్, నారాయణ, అశోక్, సతీశ్, అరుణ్, సాయిలు ఉన్నారు