ప్రత్యక్ష తరగతుల ప్రారంభం నేపథ్యంలో..
జిల్లా అధికారుల క్షేత్రస్థాయి పర్యటన
కమ్మర్పల్లి (మోర్తాడ్)/మోర్తాడ్/భీమ్‌గల్/మాక్లూర్/ ఆర్మూర్, ఆగస్టు 26: ప్రత్యక్ష తరగతులను సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రారంభించనున్న నేపథ్యంలో పలు ప్రభుత్వ పాఠశాలలను జిల్లా ఉన్నతాధికారులు గురువారం తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో పర్యటించి బడుల పరిస్థితులను గమనించారు.
కమ్మర్‌పల్లిలోని కేజీబీవీని అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాఠశాలల పరిసరాల్లో చెత్తా చెదారం, పిచ్చిమొక్కలు లేకుండా శుభ్రం చేయించాలని సిబ్బందిని ఆదేశించారు. వర్షపు నీరు నిల్వకుండా మొరం పోయించాలని సూచించారు. అనంతరం ఆమె బృహత్ ప్రకృతి వనం పనులను పరిశీలించారు. వెంట ఎంపీడీవో సంతోష్‌రెడ్డి, తహసీల్దార్ బావయ్య, ఏపీవో విద్యానంద్, ఎంఈవో ఆంధ్రయ్య, కేజీబీవీ ప్రత్యేకాధికారిణి గంగామణి, సర్పంచ్ గడ్డంస్వామి తదితరులు పాల్గొన్నారు.
మోర్తాడ్ కేజీబీవీని ట్రైనీ అదనపు కలెక్టర్ మకరంద్, తహసీల్దార్ శ్రీధర్ పరిశీలించారు. పాఠశాలలో పరిస్థితులు, ఆన్లైన్ క్లాసుల వివరాలను పాఠశాల సిబ్బందితో మాట్లాడి తెలుసుకున్నారు. వారి వెంట కేజీబీవీ ప్రత్యేకాధికారిణి స్వప్న, ఉపాధ్యాయినులు పాల్గొన్నారు.
భీమ్‌గల్ మండలంలోని చేంగల్, బడా భీమ్‌గల్ ప్రభుత్వ పాఠశాలలను జడ్పీ సీఈవో గోవింద్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులు, వాటర్ ట్యాంకులు, నల్లాలను పరిశీలించారు. పాఠశాలల ఆవరణ శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రతి తరగతి గదినీ శానిటైజ్ చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవో రాజేశ్వర్, ఏపీవో నర్సయ్య, సర్పంచులు గంగారెడ్డి, సంజీవ్ తదితరులు ఉన్నారు. మాక్లూర్ మండలంలోని గుత్ప ప్రభుత్వ ఉన్నత పాఠశాలను డిప్యూటీ డీఎంహెచ్‌వో తుకారాం రాథోడ్ పరిశీలించారు. తరగతి గదుల శానిటేషన్‌పై సిబ్బందికి సూచనలు చేశారు. ఆయన వెంట డాక్టర్ సిఖిందర్నాయక్, సిబ్బంది ఉన్నారు.
జూనియర్ కళాశాల తనిఖీ
ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను డీఐఈవో రఘురాజ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌కు పలు సూచనలు చేశారు. క్లాస్ రూములను శుభ్రం చేయించి శానిటైజ్ చేయాలన్నారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ విశ్వేశ్వర్, లెక్చరర్లు, సిబ్బంది ఉన్నారు.