కామారెడ్డి, సెప్టెంబర్ 25: రాష్ట్ర ప్రభుత్వం 57 ఏండ్లు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరా పథకం ద్వారా వృద్ధాప్య పింఛన్ మంజూరు చేసి ప్రక్రియను చేపట్టింది. దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియడంతో పరిశీలనకు ఏర్పాట్లు చేపట్టింది. కామారెడ్డి జిల్లాలో ఇప్పటికే లక్షా 49, 252 పింఛన్లు ఉండగా, మరో 26,152 ఆసరా పింఛన్ దరఖాస్తులు వచ్చాయి. పెన్షన్ అర్హత వయసును రాష్ట్ర ప్రభుత్వం 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గించింది. ఈ మేరకు అర్హులైన వారందరికీ పింఛన్ మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గత ఆగస్టు 31 వరకు 57 ఏండ్లు నిండిన వారు దరఖాస్తులకు అర్హులుగా గుర్తించింది. అర్హులైన వారి నుంచి మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులను స్వీకరించింది. ఎలాంటి ఫీజు చెల్లించకుండా దరఖాస్తులకు అవకాశం కల్పించిన ప్రక్రియ ముగియడంతో ప్రస్తుతం పరిశీలన దశలో ఉన్నాయి. ఆసరా పింఛన్ల కోసం అత్యధికంగా కామారెడ్డి మండలంలో, తక్కువగా పెద్ద కొడప్గల్లో దరఖాస్తులు వచ్చాయి.
కామారెడ్డిలో అత్యధికం పెద్ద కొడప్గల్లో అత్యల్పం
కామారెడ్డి జిల్లా పరిధిలో 22 మండలాలు ఉన్నాయి. మొత్తం లక్షా 49, 252 ఆసరా, వితంతు, దివ్యాంగులు ఇతర పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం కొత్త వాటికి దరఖాస్తులకు అనుమతి ఇవ్వగా 26,152 మంది దరఖాస్తు చేసుకున్నారు. కామారెడ్డి మండలంలో అత్యధికంగా 2808 దరఖాస్తులు చేసుకోగా, అతి తక్కువగా పెద్ద కొడప్ గల్ మండలంలో 595 దరఖాస్తులు వచ్చాయి. మద్నూర్ మండలంలో 1829, గాంధారిలో 1520, భిక్కనూర్‌లో 1490,జుక్కల్‌లో 1480, లింగంపేటలో 1401, బాన్సువాడలో 1353, మాచారెడ్డిలో 1298 దరఖాస్తులు వచ్చాయి. బీబీపేట్‌లో 836, బిచ్కుందలో 1367, బీర్కూర్‌లో 675, దోమకోండలో 821, నాగిరెడ్డి పేటలో 964, నస్రుల్లాబాద్‌లో 653, నిజాంసాగర్‌లో797 దరఖాస్తులు నమోదయ్యాయి. పిట్లంలో 1161, రాజంపేటలో 966, రామారెడ్డిలో 1084,సదాశివ నగర్లో 1186, తాడ్వాయిలో 924, ఎల్లారెడ్డి మండలంలో 943 దరఖాస్తులు వచ్చాయి.
ఆసరాగా.. అండగా…
ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ రకాల సామాజిక పెన్షన్లు ప్రారంభించడంతో అన్నివర్గాల వారికి ఆసరాగా, అండ గా నిలుస్తుస్తున్నారు. ప్రభుత్వం వృద్ధులకు పింఛన్లను అందిస్తూ భరోసా కల్పించింది. రూ.2016 పింఛన్ తీసుకున్న వృద్ధులకు ఇంటికి సరిపడా సరుకులు తెచ్చుకుంటున్నారు. ఎవరి మీదా ఆధారపడకుండా జీవిస్తున్నారు. కొత్తగా ఇవ్వనున్న ఆసరా పింఛన్లపై త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చే అవకాశాలు ఉన్నాయి. వృద్ధాప్య పింఛన్ కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ముందుగా వచ్చిన దరఖాస్తులను జిల్లాలు, మండలాలు,గ్రామాల వారీగా విభజన చేసి పరిశీలన చేయనున్నారు. మరోవైపు ప్రభుత్వం నుంచి వచ్చే మార్గదర్శకాల కోసం జిల్లా అధికార యంత్రాంగం ఎదురుచూస్తోంది.
57 ఏండ్లు ఉండి తెల్లరెషన్ కార్డు, జీపీ పరిధిలో రూ. లక్షా 50 వేలు, మున్సిపల్ పరిధిలో రూ.2 లక్షలు ఉన్న వారికి వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
త్వరలోనే పరిశీలన..
జిల్లాలో కొత్తగా వృద్ధాప్య పింఛన్ కోసం 26,152 దరఖాస్తులు వచ్చాయి. 57 ఏండ్లకు కుదించడంతో పెద్ద మొత్తంలో దరఖాస్తులు వచ్చాయి. వాటిని త్వరలోనే పరిశీలించే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రావాల్సి ఉంది. వీటిపై గ్రామ, మండల, మున్సిపల్ స్థాయిలో వచ్చిన దరఖాస్తులను త్వరలోనే విభజించనున్నాం.
వెంకట మాధవ రావు,
ప్రాజెక్టు డైరెక్టర్, కామారెడ్డి