ఎల్లారెడ్డి రూరల్/బీబీపేట్/కామారెడ్డి రూరల్, జూన్ 25 : ఎల్లారెడ్డి పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మాధవీ బాల్‌రాజ్ అధ్యక్షతన శుక్రవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల మండల స్థాయి అధికారులు ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. మండల వ్యవసాయాధికారి గాటాడి సంతోష్‌కుమార్ మాట్లాడుతూ.. వానకాలం సీజన్లో రైతులకు సబ్సిడీపై జనుము, జీలుగ అందుబాటులో ఉంచామని తెలిపారు. మండలంలోని 12,301 మంది రైతులకుగాను ఇప్పటివరకు 11,852 మంది రైతులకు 7.9 కోట్ల రూపాయలను రైతుబంధులో భాగంగా రైతుల ఖాతాల్లో జమచేశామని వెల్లడించారు. 83 మంది రైతుబీమా క్లెయిమ్లకుగాను 68 మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేసినట్లు తెలిపారు.
వానకాలంలో వరి పంటను వెదజల్లే పద్ధతిలో సాగు చేయాలని రైతులకు అవగాహన కల్పించామని చెప్పారు. ఎంఈవో వెంకటేశం మాట్లాడుతూ.. మండలంలోని అన్ని పాఠశాలల్లో మొత్తం 4,343 బాలురు, 4006 మంది బాలికలు చదువుతున్నారని చెప్పారు. పాఠశాలల్లో 218 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని, ఆన్లైన్ బోధన చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు చెప్పారు. ట్రాన్స్‌కో అధికారి మాట్లాడుతూ.. పల్లెప్రగతిలో భాగంగా గ్రామాల్లో విద్యుత్ సమస్యలను పరిష్కరించామన్నారు. భిక్నూర్, తిమ్మారెడ్డి, రుద్రారం గ్రామాల సర్పంచులు, కళ్యాణి గ్రామ ఎంపీటీసీ గ్రామాల్లోని విద్యుత్ స్తంభాల సమస్య గురించి తెలుపగా.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. సమావేశంలో ఎంపీపీ మాధవీబాల్రాజ్గౌడ్తో ఎంపీడీవో మల్లికార్జున్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు ఊషాగౌడ్, వైస్ ఎంపీపీ పెద్దెడ్ల నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని రాధ, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.