నిజాంసాగర్/ ఎల్లారెడ్డి రూరల్/ నాగిరెడ్డిపేట్/ సదాశివనగర్, ఆగస్టు 21 : జిల్లాలోని పలు మండలాల్లో ఉన్న మోడల్ స్కూళ్లలో ఆరో తరగతిలో ప్రవేశాలకు, ఏడు నుంచి పదో తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు శనివారం ప్రవేశపరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్లు తెలిపారు.
ఎల్లారెడ్డి పట్టణంలోని మోడల్స్కూల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించిన 6వ తరగతి ప్రవేశపరీక్షలకు 154మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 118 మంది హాజరయ్యారని, 36 మంది గైర్హాజరయ్యారని ప్రిన్సిపాల్ సాయిబాబా తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు 7,8,9,10వ తరగతుల్లో సీట్ల ఖాళీల భర్తీ కోసం పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. 7వతరగతిలో చేరేందుకు 30 మంది దరఖాస్తు చేసుకోగా.. 23 మంది విద్యార్థులు, 8వ తరగతిలో 24 మందికి 21 మంది, 9వ తరగతిలో 13 మందికి 10 మంది, 10వ తరగతిలో 10 మందికి నలుగురు విద్యార్థులు హాజరైనట్లు వివరించారు. మొత్తం 229 మంది విద్యార్థులకు 176 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు.
నిజాంసాగర్ ఆదర్శ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు ఖాళీల భర్తీ కోసం పరీక్ష నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ చంద్రకళ తెలిపారు. 6వతరగతిలో ప్రవేశానికి 116 మంది విద్యార్థులు , 7వ తరగతిలో 27 మంది విద్యార్థులు, 8వ తరగతిలో 13 మంది విద్యార్థులు, 9వ తరగతిలో ఏడుగురు విద్యార్థులు, 10వ తరగతిలో నలుగురు విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని వివరించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పోలీసు పర్యవేక్షణతోపాటు ఉన్నతాధికారుల సూచనలు, సలహాలతో పరీక్షలను నిర్వహించామని ప్రిన్సిపాల్ తెలిపారు.
నాగిరెడ్డిపేట్ మండలకేంద్రంలోని ఆదర్శపాఠశాల పరీక్షాకేంద్రాన్ని జిల్లా విద్యాధికారి రాజు పరిశీలించారు. 6వ తరగతిలో చేరేందుకు 143 మంది దరఖాస్తు చేసుకోగా 125 మంది హాజరయ్యారని, 7వతరగతిలో చేరేందుకు 29 మంది దరఖాస్తు చేసుకోగా.. 25 మంది, 8వ తరగతిలో చేరేందుకు 24 మంది దరఖాస్తు చేసుకోగా.. 22 మంది హాజరైనట్లు ప్రిన్సిపాల్ శ్రీలత వివరించారు. 9వ తరగతిలో ముగ్గురు, 10వ తరగతిలో ఇద్దరు పరీక్ష రాశారని చెప్పారు.
సదాశివనగర్ మోడల్ పాఠశాలలో ఆరో తరగతిలో చేరేందుకు శనివారం నిర్వహించిన ప్రవేశపరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు ప్రిన్సిపాల్ భానుమతి తెలిపారు. ఉదయం నిర్వహించిన పరీక్షకు ఏ-సెంటర్లో 150 విద్యార్థులకు 130 మంది, బీ-సెక్షన్లో 166 మంది విద్యార్థులకు 144 మంది పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షల్లో 213 మంది విద్యార్థులకు 189 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాలను తహసీల్దార్ వెంకట్రావు తనిఖీ చేశారు.
జిల్లావ్యాప్తంగా 1485 మంది విద్యార్థుల హాజరు..
విద్యానగర్, ఆగస్టు 21: మోడల్ స్కూళ్లలో ఆరు నుంచి పదో తరగతి వరకు ప్రవేశాల కోసం శనివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆరో తరగతిలో ప్రవేశం కోసం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించిన పరీక్షకు 1068 మంది విద్యార్థులకు గాను 932 మంది హాజరు కాగా.. 136 మంది గైర్హాజరైనట్లు డీఈవో రాజు, పరీక్షా విభాగం అధికారి నీలం రాజు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకు నిర్వహించిన ఏడో తగరతి ప్రవేశ పరీక్షకు 283 మంది విద్యార్థులకు 240 మంది హాజరుకాగా.. 40 మంది గైర్హాజరయ్యారు. 8వ తరగతి ప్రవేశపరీక్షకు 211 మందికిగాను 181 మంది హాజరు కాగా 30 మంది విద్యార్థులు హాజరు కాలేదు. 9వ తరగతిలో ప్రవేశానికి 119 మంది విద్యార్థులకు గాను 99 మంది హాజరుకాగా 20 మంది గైర్హాజరయ్యారు. పదోతరగతిలో ప్రవేశపరీక్షకు కోసం మొత్తం 48 మంది దరఖాస్తు చేసుకోగా 33 మంది హాజరయ్యారు. 15 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా అన్ని తరగతుల ప్రవేశాల కోసం 1789 మంది విద్యార్థులకు గాను 1485 మంది హాజరు కాగా.. 244 మంది గైర్హాజరయ్యారు.