ప్రకృతి అందాల నడుమ కొలువు దీరిన శైవక్షేత్రం
శ్రావణమాసంలో ప్రత్యేక పూజలు
ఆకట్టుకుంటున్న 108 శివలింగాలు
గాంధారి, ఆగస్టు 20:
కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని గుడిమెట్ గ్రామ సమీపంలో ఎతైన గుట్టపై, ప్రకృతి అందాల నడుమ కొలువై ఉన్న మహాదేవుడు.. మహిమగల దేవుడిగా కొలువబడుతున్నాడు. ఈ ఆలయంలోని అతి పురాతన శివలింగం ఎంతో మహిమగలదని, కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. గుట్టపై కొలువుదీరిన మహాదేవుని ఆలయం మండలంలోని ఏ గ్రామం నుంచి చూసినా కనిపిస్తుంది. ఈ గుట్టను దూరం నుంచి చూస్తే లింగాకారంలో కనబడుతూ ఆకట్టుకుంటున్నది. నూతనంగా ఏ పని ప్రారంభించాలన్న, ఎలాంటి శుభకార్యాలు చేయాలన్నా మహాదేవున్ని దర్శించుకున్న అనంతరమే. ఏటా శ్రావణ, కార్తిక మాసాల్లో మహాదేవున్ని దర్శించుకునేందుకు మండలవాసులతోపాటు, సదాశివనగర్, తాడ్వాయి తదితర మండలాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. గుట్టపై నుంచి ఏ దిక్కు చూసినా దాదాపు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలు, పచ్చని పొలాలు కనువిందు చేస్తాయి.
ఆలయ చరిత్ర..
గుట్టపై కొలువుదీరిన మహాదేవుడు మహిమగల దేవుడిగా పూజలందుకుంటున్నడు. దాదాపు 800 సంవత్సరాల క్రితం మహాదేవుని భక్తులైన శివశరములు కాలంలో, ఈ గుట్టపై శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించినట్లు తెలుస్తుంది. ఈ ఆలయంలో శివలింగంతోపాటు రెండు బసవన్నలు దర్శనమిస్తాయి. గుట్టపై ఉన్న ఆలయం శిథిలావస్థకు చేరడంతో 1979లో భీమానంద మహరాజ్, గురు జంగముల వద్ద దీక్షను తీసుకొని ఆలయాన్ని పునర్నిర్మించారు. మహాదేవుని ఆలయంలో జంగమయ్యలు(జంగములు) పూజారులుగా వ్యవహరిస్తారు.
ఆలయ విశిష్టత..
ఎత్తయిన గుట్టపై కొలువుదీరిన మహాదేవున్ని దర్శించుకుంటే ఎంతటి బాధలైన తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఆలయంలోని శివలింగాన్ని(మహాదేవున్ని) వీరశైవ సంప్రదాయ పద్ధతిలో జంగమయ్యలు పూజిస్తారు. గుట్టపై సంతోషీమాత ఆలయంతోపాటు 108(అష్టోత్తర శివలింగాలు), ద్వాదశ శివలింగాలతోపాటు వినాయకుడు, నాగేంద్రుడు, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు దర్శనమిస్తాయి. గుట్టపై ఎల్లప్పుడూ నీటితో కళకళలాడే కొలను ఇక్కడి ప్రత్యేకత. గుట్ట పైభాగంలో, ఆలయం పక్కన నిటారుగా ఉన్న రాతి శిలలు భక్తులను ఆకట్టుకుంటాయి.
గుడికి తొలిమెట్టే గుడిమెట్..
కామారెడ్డి, బాన్సువాడ ప్రధాన రహదారికి పక్కన ఉన్న గుడిమెట్ గ్రామ సమీపంలో మహాదేవుని గుట్ట ఉంటుంది. గుట్టపైన కొలువుదీరిన మహాదేవున్ని దర్శించుకునేందుకు వెళ్లడానికి తొలి మెట్టునే, గుడిమెట్టు అంటారు. ఈ కారణంతోనే మహాదేవుని ఆలయ సమీపంలో ఉన్న గ్రామానికి గుడిమెట్టు అనే పేరు వచ్చినట్లు చెబుతారు. కాలక్రమేనా గుడిమెట్టు కాస్త, గుడిమెట్గా పిలువబడుతున్నది. మండలంలోని ప్రజలు గుడిమెట్, మహాదేవుని గుట్ట అని రెండు విధాలుగా పిలుస్తుంటారు.
శ్రావణంలో ప్రత్యేక పూజలు
గుడిమెట్ గుట్టపై కొలువుదీరిన మహాదేవుడు ఎంతో మహిమ గలవాడు. ఆలయంలోని శివలింగాన్ని మనసారా మొక్కుకుంటే కోరికలు నెరవేరుతాయి. ఏటా శ్రావణ, కార్తిక మాసాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తాం. మాఘ శుద్ధ ఏకాదశి రోజున శివపార్వతుల కల్యాణం ఘనంగా నిర్వహిస్తాం. ప్రతి సోమ, శుక్ర ,శనివారాల్లో గుట్టపైకి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.
కోర్కెలు నెరవేర్చే దేవుడు..
మా గ్రామ సమీపంలో గుట్టపై కొలువుదీరిన మహాదేవుడు, కోర్కెలు నెరవేర్చే దేవుడు. మా గ్రామస్తులతోపాటు, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా మహాదేవుడిని దర్శించుకొని మొదలు పెట్టడం ఆనవాయితీ.