రెండు జిల్లాల సరిహద్దులో పంటలకు వరం
3,500 ఎకరాలకు సాగునీరు
నాలుగేండ్లుగా జోరుగా పంటల సాగు
కమ్మర్పల్లి, ఆగస్టు 20 : నిజామాబాద్, జగిత్యాల జిల్లాల సరిహద్దుల్లో ఉన్న రాళ్ల వాగు ప్రాజెక్టు రెండు జిల్లాల రైతులకు జలసిరులను అందిస్తున్నది. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం కోనాపూర్‌లో ఇరు జిల్లాల సరిహద్దులో రాళ్ల వాగు ప్రాజెక్టు ఉంది. కోనాపూర్తోపాటు జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని పలు గ్రామాలకు సాగునీటిని అందిస్తున్నది. నాలుగు సంవత్సరాలుగా ఏటా నీటితో కళకళలాడుతూ ఉండడంతో ప్రాజెక్టు పరిధిలో పంటల సాగు జోరుగా సాగుతున్నది. వానకాలంలో ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో నిండే ప్రాజెక్టు ఈసారి భారీ వర్షాలతో ముందుగానే నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టు పరిధిలో రైతులు సాగునీటి కోసం ఎదురు చూసే అవసరం లేకుండా పోయింది.
18.37 మిలియన్ల క్యూబిక్ మీటర్లు..
దట్టమైన అటవీ ప్రాంతంలోని గుట్టలు, ఎన్నెన్నో ఒర్రెలు, చిన్న వాగులను కలుపుకొని ప్రవహించే రాళ్లవాగు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండితే 18.37 మిలియన్ల క్యూబిక్ మీటర్ల నీటి లభ్యత ఉంటుంది. కోనాపూర్ పరిధిలో 707 ఎకరాలు, జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని చింతకుంటలో 300, భూషణ్‌రావు పేటలో 857 ఎకరాలు, ఊట్పల్లిలో 408 ఎకరాలు, పెగ్గర్లలో 168 ఎకరాలు, కథలాపూర్‌లో 520 ఎకరాలకు సాగునీరందుతున్నది. ఈ నీటి లభ్యతతో కాలువల ద్వారా నేరుగా పంటలకు, చెరువుల ద్వారా నీటిని అందిస్తారు.18.37 క్యూబిక్ మిలియన్ల నీటిలోంచి 11.24 మిలియన్ల క్యూబిక్ మీటర్ల నీటిని కాలువల ద్వారా అందిస్తారు. మిగతా నీటిని చింతకుంట, భూషన్‌రావు పేట్, ఊట్పల్లి, కథలాపూర్, సిరికొండ చెరువులకు అందిస్తారు. ఆయకట్టు పరిధిలో వరి, వేరుశనగ పంటల సాగు చేస్తున్నారు. కోనాపూర్ గ్రామంలో ఈ ప్రాజెక్టు భరోసాతో వరి సాగు పెద్ద ఎత్తున జరుగుతుంటుంది. ప్రాజెక్టు కారణంగా మండలంలో అధికంగా వరి సాగు చేసే గ్రామంగా కోనాపూర్ నిలుస్తూ వస్తున్నది.