చాలారోజుల తర్వాత మళ్లీ పెండ్లి భాజాలు మోగుతున్నాయి. శ్రావణ మాస ముహూర్తాల వేళ కల్యాణరాగం పాడేందుకు పెద్దలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. శ్రావణ మాసం ప్రారంభం నుంచే ఉమ్మడి జిల్లాలో పెండ్లిళ్ల సందడి మొదలైంది. కొవిడ్ ఉధృతితో వాయిదా పడినవి, కొత్తగా కుదిరిన సంబంధాలు పెండ్లి పీటలెక్కుతున్నాయి. వివాహ వేడుకలతోపాటు గృహ ప్రవేశాలకూ ముహూర్తాలు ఖరారు చేసుకున్నారు.
-కోటగిరి ఆగస్టు 17
ఉమ్మడి జిల్లాలో పెండ్లిళ్ల సందడి మొదలైంది. తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు, ఏడడుగులు, మూడుముళ్లతో పెళ్లి సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. శ్రావణమాసం ప్రారంభం కావడంతో శుభకార్యాల నిర్వహణకు ప్రజలు సిద్ధమవుతున్నారు. మంచి ముహూర్తాలు లేకపోవడం, కరోనా విజృంభణ నేపథ్యంలో కొన్ని నెలలుగా శుభకార్యాలు వాయిదా పడుతూ వచ్చాయి. ముహూర్తాలు నిర్ణయించుకొని ఫంక్షన్ హాళ్లు బుక్ చేసుకున్న తర్వాత కూడా కొన్ని పెండ్లిళ్లు నిలిచిపోయాయి. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతోపాటు మంచి ముహూర్తాలు కూడా ఉండడంతో ఈ నెలలో వందలాది జంటలు ఒక్కటి కానున్నాయి.
ఈ నెల 18, 20, 21,22, 25, 26, 27, సెప్టెంబర్ 1వ తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నట్లు పురోహితులు తెలిపారు. ఆగస్టు 18 ఏకాదశి మూల నక్షత్రం, 21న శ్రావణ నక్షత్రం,25 ఉత్తరాభద్ర,26 రేవతి నక్షత్రంలో దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయి. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు శుభ ముహూర్తాలు లేవు. అక్టోబర్ 7,8,10, 15, 16,17, 20,21,23, 24, 31 నవంబర్ నెల కార్తీక మాసంలో 6,10,12, 13,17,20,21 తేదీల్లో శుభముహూర్తాలు ఉన్నాయి.
పెండ్లిళ్ల సందడితో మార్కెట్లో బంగారం, వస్ర్తాలు, సామగ్రి కొనుగోళ్లు ఊపందుకున్నాయి. బంగారు దుకాణాల్లో అమ్మకాలు పెరిగాయి. క్యాటరింగ్ సంస్థలకు, వంట మాస్టర్లు, బాజాభజంత్రీల వాళ్లకు డిమాండ్ ఏర్పడింది. చాలా కాలంగా వెలవెలబోయి న ఫంక్షన్ హాళ్లు ముస్తాబవుతున్నాయి. ఈ నెలాఖరు వరకు అనేక ఫంక్షన్ హాళ్లు బుక్ అయినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
శ్రావణమాసంలో జరిగే పెండ్లిళ్ల ఫొటోగ్రఫీ కోసం అనేక మంది ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. ఏడాదిన్నర కాలం కరోనా కారణంగా ఆశించిన స్థాయిలో బుకింగ్స్ లేవు. ప్రస్తుతం ప్రభు త్వం ఆంక్షలు తొలగించడం.. శుభకార్యాలకు ప్రజలు మొగ్గు చూపడంతో గిరాకీలు వస్తున్నాయి.
ఈ నెల 27 వరకు పలు తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. కరోనాతో రెండేండ్లుగా శుభకార్యాలు తక్కువగా జరిగాయి. అక్టోబర్, నవంబర్లలో చాలా జంటలు వివాహ బంధంతో ఒకటి కాబోతున్నా యి.