కాశిం దూలాకీ దొస్తారో దిన్.. దూలా.. దూలా మోతలు.. అసై దూలా ఆటలు.. ఈ పదాలు పల్లెల్లో వినగానే గుర్తుకు వచ్చేది మొహర్రం(పీరీల పండుగ). తెలంగాణ ప్రాంతంలో కులమతాలకు అతీతంగా జరుపుకొనే ప్రత్యేక పండుగ ఇది. ప్రతిపల్లెలో పీరీలు ప్రతిష్ఠించి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ సందర్భంగా గ్రామాల్లోని ప్రతి ఒక్కరూ నిష్టతో నియమాలు పాటిస్తూ మతసామరస్యాన్ని చాటుతుంటారు.
బాన్సువాడ, ఆగస్టు 17: కుల,మతాలకు అతీతంగా జరుపుకొనే పండుగ మొహర్రం. తెలంగాణ ప్రాంతంలోని గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత పవిత్రంగా నిర్వహిస్తారు. పీరీల పండుగ సందర్భంగా గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంటున్నది. మసీదు(ఆశీర్ ఖాన)ల వద్ద అసై దూలా, మజ్ను, గుర్రం ఆటలతో పండుగ వాతావరణం నెలకొంటున్నది. చివరిరోజు సాయంత్రం పీరీల సవారీని గ్రామాల్లో నిర్వహిస్తారు. పీరీలను ఎత్తుకొని ఆడించే భక్తులకు సిగాలు రావడం, వారిని ఇతరులు పట్టుకోవడం, సంతానం కలుగని మహిళలు ఒడిపట్టడం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అనంతరం పీరీలను చెరువుల్లో నిమజ్జనం చేస్తారు.
గ్రామాల్లో పీరీలను ప్రతిష్ఠించే స్థలాలను ఆశీర్ఖానాలు (మసీదులు) అంటారు. యేటా ఆశీర్ఖానల్లో పీరీలను ప్రతిష్ఠించి రోజుకో పీరీ వద్ద ఉత్సవాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా మౌలాలీ, కాశిం దూలా, బీబీ ఫాతిమా (దూదిపీరు) హుస్సేన్ బీబీ, అబ్బాస్ అలీ పీరీలను మసీదుల్లో ప్రతిష్ఠిస్తారు. ఆశీర్ఖాన ఎదుట అగ్నిగుండాలు వేసి దానిచుట్టూ చేయిచేయీ పట్టుకొని అసై దూలా, గుర్రం ఆట, మజ్ను ఆడతారు. ప్రతిష్ఠించిన రోజు నుంచి ప్రతిరోజూ బాజా భజంత్రీలతో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేలా ఆటలు ఆడుతుంటారు. పదిరోజల పాటు వేడుకలను అత్యంత పవిత్రంగా భావిస్తారు. మద్యం, మాంసాహారానికి దూరంగా ఉంటూ ఆశీరుఖానల్లో ప్రతిష్ఠించిన పీరీల వద్ద పూజలు నిర్వహించి భక్తులు మొక్కులను చెల్లించుకుంటారు.
మొహర్రం పండుగ రోజు అన్ని పీరీల సవారీ వైభవంగా నిర్వహిస్తారు. పదిరోజుల పాటు పూజలందుకున్న పీరీలు మొహర్రం రోజు సాయంత్రం గ్రామ చావిడీలు, మూడుతొవ్వలు ఉన్నచోట్ల సవారీ నిర్వహిస్తారు. సవారీ జరుగుతున్నప్పుడు పీరీలు పడిపోకుండా రక్షణగా భక్తులు నిలబడి, తాళ్లతో పట్టుకొంటారు. ఈ రోజున బెల్లం, జీలకర్ర, సోంపుతో కలిపి తయారుచేసిన షర్భత్ను తీర్థ ప్రసాదంగా భక్తులకు పంపిణీ చేస్తారు. పేలపుండలు, బజ్జీలు, చాక్లెట్లు, బిస్కెట్లను పీరీల మీదకు విసురుతూ భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. పీరీలన్నీ కలియబడిన అనంతరం గ్రామ చెరువులో నిమజ్జనం చేసి పండుగను ముగిస్తారు.
గ్రామాల్లో ప్రతిష్ఠించిన పీరీల సవారినీ అత్యంత పవిత్రంగా నిర్వహిస్తారు. మౌలాలీ, కాశిం దూలా, లాల్సాహెబ్, పీరీల సవారీ అత్యంత పవిత్రంగా భావిస్తారు. రోజూ ఇండ్లను శుభ్రపరచుకొని కల్లాపి చల్లి శుద్ధి చేసుకుంటారు. బాన్సువాడ మండలంలోని సోమేశ్వర్ గ్రామంలో నిర్వహించే మౌలాలీ సవారీకి, గాంధారి మండంలోని గండివేట్ లోని కాశిం దూలా పీరీ సవారీకి దూర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి కందూరు, ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు.
పీరీల పండుగను హిందువులు, ముస్లిములు ఎంతో పవిత్రంగా జరుపుకొంటారు. కోర్కెలు తీరాలని భక్తులు కందూర్లతో మలీద నైవేద్యం సమర్పిస్తారు. పీరీలకు బెల్లం,సొంగరొట్టెలతో చేసిన నైవేద్యం సమర్పించి మేకలతో కందూర్లు చేసి పెండ్లి పనులను ప్రారంభిస్తారు. సంతానం కలుగాలని, అనుకున్న పనులు నెరవేరాలని పీరీలకు మొక్కుకుంటే పనులు సజావుగా జరుగుతాయని ప్రగాఢ నమ్మకం. సంతానం కలిగిన తర్వాత పీరీల పేర్లనే పిల్లలకు పెట్టి తమ భక్తిని చాటుకుంటారు. మరికొందరు వెండి తొట్లెను, వెండి గుర్రాలను పీరీలకు సమర్పించి, పిల్లల పుట్టువెంట్రుకలు సమర్పిస్తారు.