ఉమ్మడి జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ రాజు
నిజాంసాగర్, సెప్టెంబర్ 16: సీఎం కేసీఆర్ దళితుల పక్షపాతి అని, అందుకు ప్రతి దళిత కుటుంబానికి రూ. పది లక్షలను అందజేస్తున్నారని జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు అన్నారు. మండలంలోని మహ్మద్‌నగర్ గ్రా మంలో దళితబంధుపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి నిజాంసాగర్ మండలాన్ని ఎంపి క చేయడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. నాలుగు రోజుల్లో కమిటీలను ఏర్పాటుచేసి సర్వే ప్రారంభిస్తారని చెప్పారు. సొసైటీ చైర్మన్ వాజిద్, నాయకులు దఫేదార్ విజయ్, కాశయ్య, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఊరూరా అవగాహన సదస్సులు..
దళితబంధు పథకానికి కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ మేరకు మండలంలోని ఆయా గ్రామాల్లో ఈ పథకంపై దళితులకు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నారు. మండలంలో మొత్తం 27 గ్రామ పంచాయతీలు ఉండగా.. నిజాంసాగర్, కొమలంచ, నర్వ, మహ్మద్‌నగర్, మల్లూర్, జక్కాపూర్, అచ్చంపేట, వెల్గనూర్, బ్రాహ్మణపల్లి, సంగీతం, తున్కిపల్లి, బూర్గుల్ గ్రామాల్లో గురువారం సదస్సులను ఏర్పాటుచేశారు. పథకం అమలు తీరు, కమిటీల ఏర్పాటు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. నాలుగు రోజుల క్రితం సీఎం కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమావేశం ఏర్పాటుచేసి దిశానిర్దేశం చేయగా.. ఆ విషయాలను గ్రామాల్లో వివరిస్తున్నారు. అధికారులు సర్వే నిర్వహిస్తారని, ఒక్కో కుటుంబానికి రూ.పది లక్షలను వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారని తెలిపారు. పథకంలో ఉన్న 30 యూనిట్లపై అవగాహన కల్పించారు. తమను ఆదుకుంటున్న సీఎం కేసీఆర్ సల్లంగా ఉండాలని దళితులు దీవిస్తున్నారు.