నాగిరెడ్డిపేట్/ గాంధారి/ తాడ్వాయి/ రాజంపేట/ విద్యానగర్/ కామారెడ్డి టౌన్/ బీర్కూర్/ దోమకొండ/ , సెప్టెంబర్ 12 : జిల్లాలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు, అన్నదానాలు కొనసాగుతున్నాయి. ఆదివారం పలు గ్రామాల్లో అన్నదానం చేశారు. నాగిరెడ్డిపేట్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మండపం వద్ద అన్నదానం చేశారు. అంతకుముందు ఎస్సై ఆంజనేయులు, సిబ్బంది ప్రత్యేకపూజలు చేశారు. గాంధారి మండలకేంద్రంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఆదివారం అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘంతో పాటు డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలోఎంపీటీసీ సభ్యుడు పత్తి శ్రీను, పత్తి సాయిలు, స్వామి, గంగాధర్, రవి, వెంకటి తదితరులు పాల్గొన్నారు. తాడ్వాయి మండల పరిధిలోని గ్రామాల్లో మండపాల వద్ద పూజలు, అన్నదానం చేశారు. సాయంత్రం యువతీ యువకులు దాండియా, సంప్రదాయ నృత్యాలు చేసి సందడి చేశారు. భిక్కనూరు మండలంలోని అంతంపల్లి గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించగా.. అన్నదాన దాత గోల్కొండ సాగర్‌రెడ్డి, యూత్ సభ్యులు పాల్గొన్నారు.
కామారెడ్డిలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో ఉన్న సంకష్టహర మహా గణపతి ఆలయంలో అర్చకులు గంగవరపు ఆంజనేయ శర్మ, సంపత్‌కుమార్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. విద్యానగర్‌లోని శివసాయి పార్క్ గణేశ్ మండలిని డీఎస్పీ సోమనాథం దంపతులు శనివారం రాత్రి దర్శించుకున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి, మండలి ప్రతినిధులు డీఎస్పీ దంపతులకు శాలువా కప్పి సత్కరించారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుంబాల రవియాదవ్, మండలి అధ్యక్షుడు శివారెడ్డి, ధర్మపురి, జగన్, యాదగిరి, మోహన్‌రెడ్డి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
బీర్కూర్‌తో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రతిష్ఠించిన వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. పలుచోట్ల భజన కార్యక్రమాలను ఏర్పాటుచేస్తున్నారు. దోమకొండలోని కపిల్ యూత్, ఆదర్శ యూత్ గణేశ్ మండళ్ల ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయకుల వద్ద జడ్పీటీసీ తిర్మల్‌గౌడ్ ఆదివారం ప్రత్యేక పూజలను చేశారు. ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని ఆయన సూచించారు. కామారెడ్డి బల్దియా పరిధిలోని దేవునిపల్లి 14వ వార్డులో వివేకానంద గణేశ్‌మండలి ఆధ్వర్యంలో ఆదివారం అన్నదానం ఏర్పాటుచేశారు. మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇందుప్రియా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. గణేశ్ మండలి అధ్యక్షుడు మోహనాచారి దంపతులు అన్నదానం చేశారు. బల్దియా వైస్ చైర్‌పర్సన్‌ను సన్మానించారు.