ఎల్లారెడ్డి డీఎస్పీ శశాంక్‌రెడ్డి
ఎల్లారెడ్డి రూరల్/ లింగంపేట/ నిజాంసాగర్, సెప్టెంబర్ 9 : గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో జిల్లాలోని పలు గ్రామాల్లో పోలీసులు మండపాల నిర్వాహకులతో గురువారం సమావేశాలు నిర్వహించి పలు సూచనలు చేశారు.
ఎల్లారెడ్డి మండలకేంద్రంలోని ముత్యపు రాఘవులు ఫంక్షన్హాల్లో డీఎస్పీ శశాంక్‌రెడ్డి శాంతికమిటీ సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. సురక్షితమైన స్థలాల్లో, ఇతరులకు ఇబ్బంది కలుగకుండా వినాయక మండపాలను ఏర్పాటు చేసుకోవాలని, గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని డీఎస్పీ శశాంక్‌రెడ్డి అన్నారు.
మండపాలకు విద్యుత్ సరఫరా కోసం డీడీ చెల్లించాలన్నారు. మండపాల వద్ద సౌండ్‌తో ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను జరుపుకోవాలన్నారు. సమావేశంలో సీఐ రాజశేఖర్, ఎస్సై శ్వేత, జడ్పీటీసీ సభ్యుడు ఉషాగౌడ్, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, తహసీల్దార్ అంజయ్య, ఎంపీడీవో మల్లికార్జున్‌రెడ్డి, వైస్ ఎంపీపీ పెద్దెడ్ల నర్సింహులు, కౌన్సిలర్లు జంగం నీలకంఠం అప్ప, ఎరుకల సాయిలు, శ్రీను, సర్పంచులు పాల్గొన్నారు.
లింగంపేట మండలకేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ శశాంక్‌రెడ్డి మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. వినాయక మండపాలను ఏర్పాటు చేసేవారు పోలీస్స్టేషన్లలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలని సూచించారు. సమావేశంలో ఎల్లారెడ్డి సీఐ రాజశేఖర్, ఎస్సై శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
నిజాంసాగర్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో వివిధ నాయకులు, కుల సంఘాలు, వినాయక మండపాల నిర్వాహకులతో రూరల్ సీఐ చంద్రశేఖర్ సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. భక్తిశ్రద్ధలతో వినాయక నవరాత్రులను నిర్వహించుకోవాలని, మండపాలకు విద్యుత్ సరఫరా విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. విగ్రహాలను నిమజ్జనం చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. సమావేశంలో తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీవో పర్బన్న, ఎస్సై సయ్యద్ హైమద్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దుర్గారెడ్డి పాల్గొన్నారు.