కలెక్టర్ జితేశ్ పాటిల్
కామారెడ్డి టౌన్, సెప్టెంబర్ 8: జిల్లాలో వానకాలం ధాన్యం కొనుగోళ్లపై యాక్షన్ ప్లాన్‌ను రూపొందించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అధికారులను ఆదేశించారు. సమీకృత కార్యాలయ భవనంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. అక్టోబర్‌లో 4 లక్షల 2వేల మెట్రిక్ టన్నుల ధాన్యం విక్రయానికి వచ్చే అవకాశం ఉందని, ఇందుకోసం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు, గన్నీ బ్యాగులను సిద్ధంచేయాలని ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలు, తేమ శాతంపై రైతులకు ముందుగానే అవగాహన కల్పించాలన్నారు. గత వానకాలానికి సంబంధించిన ధాన్యం మిల్లింగ్‌ను ఈ నెల 15లోగా పూర్తిచేయాలని రైస్ మిల్లర్లను ఆదేశించారు. సమావేశంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ వెంకటమాధవరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి భాగ్యలక్ష్మి, మార్కెటింగ్ అధికారిణి రమ్య, కో-ఆపరేటివ్ అధికారిణి వసంత, సివిల్ సప్లయీస్ డీఎం జితేందర్ ప్రసాద్, పౌర సరఫరాల అధికారి రాజశేఖర్, మార్క్‌ఫెడ్ డీఎం, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస రెడ్డి, గౌరీశంకర్ పాల్గొన్నారు.
ఈవీఎంల పరిశీలన
జిల్లా కేంద్రంలోని ఏఎంసీ గోదాముల్లో భద్రపర్చిన ఈవీఎంలను కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ పరిశీలించారు. గోదాముల భద్రతా ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
‘ఉపాధి’ రికార్డులను సక్రమంగా నిర్వహించాలి
కామారెడ్డి టౌన్, సెప్టెంబర్ 8: గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఉపాధి హామీ పనులకు సంబంధించిన అన్ని రికార్డులను సక్రమంగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సంబంధిత అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మండలాల వారీగా సమీక్షించారు. జాబ్‌కార్డులు, ఏడు రిజిస్టర్ల నిర్వహణ, వర్క్‌సైట్ బోర్డులు, ఫొటోలతో కూడిన వర్క్ ఫైళ్లు పకడ్బందీగా ఉండాలని ఆదేశించారు.
కలెక్టర్‌కు మట్టి ప్రతిమ అందజేత
దివ్యాంగులకు చెందిన దివ్య హస్త సొసైటీ ఆధ్వర్యంలో తయారు చేసిన మట్టి గణపతి విగ్రహాన్ని కలెక్టర్ జితేశ్ పాటిల్‌కు జిల్లా సంక్షేమశాఖ అధికారిణి సరస్వతి, సొసైటీ అధ్యక్షురాలు పోచవ్వ అందజేశారు. ఈ సందర్భంగా సొసైటీ సేవలను కలెక్టర్ అభినందించారు. ప్రతిఒక్కరూ మట్టి ప్రతిమలను ఏర్పాటు చేసుకొని పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని కోరారు.
రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలి
ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటించాలని కలెక్టర్ జితేశ్ పాటిల్ సూచించారు. 14 శాఖలతో కూడిన రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని చైర్మన్, కలెక్టర్ అధ్యక్షతన బుధవారం నిర్వహించగా.. వైస్ చైర్పర్సన్, ఎస్పీ శ్వేతారెడ్డి, కన్వీనర్, జిల్లా రవాణా శాఖ అధికారిణి వాణి హాజరై పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మ న్ మాట్లాడుతూ.. జిల్లా పరిధిలోని ప్రధాన రహదారులపై రోడ్డు ప్రమాదాలు జరుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదం చోటుచేసుకుంటే క్షతగాత్రులకు వెంటనే వైద్యసాయం అందేలా అంబులెన్సులు అక్కడికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలని, రోడ్డు భద్రత నియమాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.