500 మందికి దుప్పట్లు,ఆహారం పంపిణీ
రెండోరోజూ కొనసాగిన భోజన వితరణ
ఖలీల్‌వాడి, సెప్టెంబర్ 8: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిజామాబాద్ నగరం అతలాకుతలం అయ్యింది. దీంతో చలించిన తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఆపన్నహస్తాన్ని అందిస్తున్నారు. నేనున్నానంటూ ముంపు బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. రెండు రోజుల పాటు ఏకధాటిగా కురిసిన వర్షాలకు నగరంలోని అంబేద్కర్ కాలనీ, గంగాస్థాన్ ఫేస్-2, చంద్రశేఖర్‌కాలనీ, కంఠేశ్వర్ ప్రాంతాల్లో పలు ఇండ్లలోకి నీరు చేరింది. దీంతో వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. బాధితులకు ఎమ్మెల్సీ కవిత మంగళవారం దుప్పట్లు, ఆహార పంపిణీ కార్యక్రమాలను చేపట్టారు. బుధవారం రెండో రోజూ గంగస్థానలోని ఓ అపార్ట్మెంట్లో ఉన్న బాధితులకు ఆహారాన్ని అందజేశారు. వర్షాలతో ఇండ్లల్లోకి నీరు రావడంతో ఇబ్బందులు పడుతున్న పలు కుటుంబాలకు ఎమ్మెల్సీ కవిత ఆదేశాలతో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భోజన ఏర్పాట్లను చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం రెండు పూటలా వారి ఆకలిని తీరుస్తూ అమ్మలా అన్నం పెడుతున్నారు. జిల్లాలో ఎలాంటి ఆపద వచ్చినా ప్రజలకు అండగా ఉంటున్న ఎమ్మెల్సీ కవితకు వరద బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ప్రభుత్వ దవాఖానల్లో రోగుల బంధువులకు నిరంతరం భోజనం ఏర్పాటుచేసి అందరి మన్ననలు పొందుతున్నారు. జిల్లాలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అండగా నిలుస్తున్నారు. కరోనా కష్టకాలంలో సైతం ఎంతోమందికి ప్రాణదాతగా నిలిచారు.
అమ్మలా ఆదరిస్తూ..
సహాయం చేయడం తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలికే సాధ్యం. జిల్లా ప్రజలను ఆమె అమ్మలా ఆదరిస్తున్నారు.
నిరంతర సేవలు అందిస్తూ..
ఎమ్మెల్సీ కవిత జిల్లా ప్రజలకు నిరంతరంగా సేవలను అందిస్తున్నారు. కరోనా సమయంలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌లో ధైర్యం నింపారు. ప్రస్తుతం ముంపు బాధితులకు అండగా నిలుస్తున్నారు.
ఆపదలో ఉన్నవారికి అండ..
ఆపదలో ఉన్నవారికి తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత అండగా ఉంటున్నారు. ఆమె ఆదేశాల మేరకు పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి దుప్పట్లు, రెండు పూటలా భోజన సౌకర్యాన్ని కల్పిస్తున్నాం.