
ఎడపల్లి (శక్కర్‌నగర్), అక్టోబర్ 7: ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామానికి చెందిన కల్లు ముస్తాదారు చేసిన ఫిర్యాదులో భాగంగా ఏ -5 నిందితుడిగా ఉన్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్‌ను గురువారం ఎడపల్లి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు నుంచి ఆయనను కస్టడీలోకి తీసుకున్న బోధన్ రూరల్ సీఐ రవీందర్ నాయక్, సిబ్బంది ముందుగా బోధన్ ప్రభుత్వ దవాఖానలో వైద్యపరీక్షలు చేయించారు. అనంతరం ఎడపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గతనెల 9న జాన్కంపేట్ గ్రామానికి చెందిన కల్లు ముస్తేదారు జయవర్ధన్ గౌడ్ తనను ‘తీన్మార్ మల్లన్న పాదయాత్ర’ పేరుతో రూ.20లక్షలు డిమాండ్ చేసి, రూ. 5లక్షలు చెల్లించినా మిగతా డబ్బుల కోసం వేధిస్తున్నారంటూ ఉప్పు సంతోష్, రాధాకిషన్ గౌడ్, రాజా గౌడ్, సాయాగౌడ్‌తో పాటు తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న మల్లన్నను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆయనను బోధన్ ఏసీపీ రామారావు, రూరల్ సీఐ రవీందర్ నాయక్ సమక్షంలో ఎడపల్లి ఎస్సై డి. ఎల్లా గౌడ్ విచారణ చేపడుతున్నారు. విచారణలో భాగంగా 48 గంటలపాటు కస్టడీకి న్యాయస్థానం సూచించింది. ఆయనను తిరిగి శనివారం ఉదయం చంచల్‌గూడ జైలుకు పంపనున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.