పరిరక్షణ కమిషన్ రాష్ట్ర సభ్యురాలు
కామారెడ్డి టౌన్, సెప్టెంబర్ 7: బాలల రక్షణతో పాటు వారి హక్కులను కాపాడాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రాష్ట్ర సభ్యురాలు అపర్ణ అన్నారు. జిల్లాకేంద్రంలోని సమావేశపు మందిరంలో బాలల హక్కులపై మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ను 2019లో ఏర్పాటుచేశారని, అప్పటి నుంచి వారికి రక్షణగా నిలుస్తున్నామని చెప్పారు. గత ఫిబ్రవరి నుంచి బాల అదాలత్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా కారణంగా అనాథలైన బాలికలను రక్షించడానికి సీఎం తొమ్మిది మంది మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటుచేశారని తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని అంగన్వాడీ సిబ్బంది బాలలను బాగా చూసుకుంటున్నారన్నారు. పోషణ్ అభియాన్ మాసోత్సవంలో భాగంగా సెప్టెంబర్‌లో అంగన్వాడీ కేంద్రాల్లో మొక్కలు నాటాలని, పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని సూచించారు. పోక్సో కేసుల్లో బాధితులకు పరిహారం సకాలంలో అందేలా అధికారులు చూడాలన్నారు. భవిష్యత్తులో బాలల రెస్క్యూ గృహాల్లో ఎవరూ లేకుండా ఉండేలా అధికారులు పనిచేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మాట్లాడుతూ.. ఐసీడీఎస్, పోలీసు, రెవెన్యూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ బాలల సంక్షేమం కోసం పాటుపడాలని సూచించారు. జిల్లాలోని 175 గ్రామ పంచాయతీల్లో విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలను సర్పంచ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తామని తెలిపారు. బాలల హక్కులకు ఎవరు భంగం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి సరస్వతి మాట్లాడుతూ.. కొవిడ్‌తో అనాథలైన 14 మంది పిల్లలకు నెలకు రూ.రెండువేలతో పాటు నిత్యావసర సరుకులు అందజేస్తున్నామని తెలిపారు. వారికి మొబైల్ ఫోన్లను కూడా అందజేశామని, అందులో అత్యవసర నంబర్లు ఉంటాయని చెప్పారు. 87 మంది బాలలు పాక్షికంగా అనాథలు కాగా వారికి హైదరాబాద్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ సాంకేతిక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో మూడేండ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాలు కల్పించామన్నారు. ఈ సందర్భంగా బాలల హక్కులపై రూపొందించిన పుస్తకాలను విడుదల చేశారు. ఏఎస్పీ అన్యోన్య, బాలల సంక్షేమ కమిటీ జిల్లా చైర్మన్ సత్యనారాయణ, డీఎంహెచ్‌వో చంద్రశేఖర్, జిల్లా ప్రభుత్వ దవాఖానల కో-ఆర్డినేటర్ అజయ్‌కుమార్, జిల్లా ఎస్టీ, ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖ అధికారులు దయానంద్, రాజు, శ్రీనివాస్, షీటీం సభ్యులు, స్వచ్ఛందసంస్థల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
గడీకోట సందర్శన
దోమకొండ, సెప్టెంబర్ 7: దోమకొండలోని గడీకోటతో పాటు ఆనంద్భవన్లోని హ్యాండ్లూమ్స్ తయారీని బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యురాలు అపర్ణ సందర్శించారు. కోటలోని ఆలయాలను దర్శించుకున్నారు. మహిళలకు ఇస్తున్న కుట్టుశిక్షణ, తయారుచేస్తున్న మాస్కులను పరిశీలించారు. ఆమెను బెతెల్ ఆశ్రమ నిర్వాహకురాలు, చైల్డ్ రైట్స్ నిర్వాహకురాలు దాస్ ఎల్లం సుగుణ, గడీకోట ట్రస్టు సభ్యులు సన్మానించారు. ఆమె వెంట డీడబ్ల్యూవో సరస్వతి, సీడబ్ల్యూసీ చైర్మన్ సత్యనారాయణ, సీడీపీవో రోచిష్మ, గడీకోట ట్రస్ట్ మేనేజర్ బాబ్జీ తదితరులు ఉన్నారు.