నేడు ఎడ్ల పొలాల అమావాస్య
ముస్తాబైన బసవన్నలు
ప్రత్యేక పూజలకు సిద్ధమైన రైతులు
మార్కెట్లో కొనుగోళ్ల సందడి
గాంధారి, సెప్టెంబర్ 5: ఆరుగాలం కష్టం చేసి పంటలను పండించే రైతన్నకు సాగు పనిలో చేదోడు వాదోడుగా ఉండే బసవన్నల(ఎద్దులు)తో విడదీయరాని బంధం. చేనులో దుక్కిని దున్ని, విత్తనం విత్తిన నుంచి, పంటను నూర్పిడి చేసి, ధాన్యాన్ని ఇంటికి తెచ్చేంత వరకు ప్రతి పనిలో రైతన్నకు, ఎడ్లు ఏదో రకంగా సహాయపడుతుంటాయి. భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసే రైతులు, సాగులో సహాయపడే బసవన్నలను ఎంతో ప్రేమగా చేసుకోవడంతోపాటు, దైవంగా భావిస్తారు. ఎడ్లను నందీశ్వరుని అవతారంగా భావించే రైతులు వాటిని పూజించి తమ భక్తిని చాటుకుంటారు. ఎడ్ల పొలాల అమావాస్య వచ్చిందంటే చాలు అన్నదాతల ఇండ్లలో పండుగ వాతావరణం నెలకొంటుంది. ప్రతి సంవత్సరం ఎడ్ల పొలాల అమావాస్య రోజున ఎడ్లను భక్తితో పూజిస్తారు. పండుగను పురస్కరించుకొని ఎడ్లకు శుభ్రంగా స్నానాలు చేయించి, అందంగా రంగులను అద్ది, అలంకరణ వస్తువులతో ముస్తాబు చేస్తారు. అనంతరం బసవన్నలకు పిండి వంటలతోపాటు, ఉలువలు, బబ్బెర్లతో చేసిన గుడాలు, బెల్లాన్ని తినిపిస్తారు. ఈ పండుగ రోజున ఎడ్లతో ఎలాంటి వ్యవసాయ పనులను చేయించరు.
ఏటా శ్రావణ మాసం ముగింపు అమావాస్య రోజున రైతన్నలు ఎడ్ల పొలాల పండుగను జరుపుకొంటారు. ఈ పండుగనే ఎడ్ల పొలాల అమావాస్య, పొలాల అమావాస్య అని పిలుస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్ల్లాలో వ్యవసాయదారులు జరుపుకొనే పెద్ద పండుగల్లో ఎడ్ల పొలాల అమావాస్య ముఖ్యమైనది. అమావాస్య సోమ, మంగళవారాల్లో ఉండడంతో జిల్లాలోని రైతులు సోమవారం ఎడ్ల పొలాల అమావాస్యను జరుపుకోనున్నారు.
బసవన్నలకు అందంగా అలంకరణ..
ఎడ్ల పొలాల అమావాస్య వచ్చిందంటే చాలు వ్యవసాయం చేసే రైతులు తమ వద్ద ఉండే ఎడ్లను రెండు, మూడు రోజుల నుంచే పండుగ కోసం సిద్ధం చేస్తారు. ఈ పండుగను పురస్కరించుకొని రైతులు ఉదయాన్నే సమీపంలోని చెరువుల్లోకి, వాగుల్లోకి ఎడ్లను తీసుకెళ్లి శుభ్రంగా కడుగుతారు. అనంతరం ఇండ్లకు తీసుకువచ్చి రకరకాల రంగులను ఎడ్లకు ఒంటిపై అందంగా అద్దుతారు. కొమ్ములకు రంగులు వేస్తారు. కాళ్లకు, మెడలకు గజ్జలు, గంటలతో కూడిన దండలను కడతారు. నడుముపై జూలువేస్తారు.. కొత్త మూకుతాళ్లతోపాటు రంగు రంగుల తాళ్లతో చేసిన మోర్కెలను కట్టి అందంగా అలంకరిస్తారు. ఎద్దుల అలంకరణ విషయంలో గ్రామాల్లో రైతులు ఒకరికిమించి ఒక్కరు పోటీపడి ముస్తాబు చేస్తారు. అనంతరం ఎడ్ల(బసవన్న) నుదుట కుంకుమ పెట్టి, మంగళ హారతులిస్తారు. అప్పటికే సిద్ధం చేసిన ఉలువలు, బబ్బెర్లతో ఉడకబెట్టిన గుడాలను, బెల్లంతో చేసిన పాకాన్ని, పిండి వంటలను బసవన్నలకు తినిపిస్తారు. అనంతరం గ్రామాల్లోని ప్రధాన వీధుల గుండా ఎడ్లను ఊరేగించి, పంట చేనుల్లోకి తీసుకెళ్తారు.
మార్కెట్లో సందడి
పొలాల అమావాస్య సందర్భంగా మండల కేంద్రాల్లో సందడిగా ఉంది. ఎడ్లకు అలంకార సామగ్రి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. రంగు రంగుల తాళ్లు, పగ్గాలు, గజ్జెలు, గంటలు, ఎడ్ల కొమ్ములకు పూయడానికి రంగులు విక్రయించే దుకాణాల్లో సందడి ఎక్కువగా కనిపిస్తున్నది. వారాంతపు సంతలో వీటికి గిరాకీ ఎక్కువగా ఉంది.
సంతోషంగా ఉంటుంది..
వ్యవసాయంలో ప్రతి పనిలో ఆసరాగా నిలుస్తున్న బసవన్నల(ఎడ్ల)కు పండుగను నిర్వహించడం సంతోషంగా ఉంటుంది. పొలాల అమావాస్య రోజున ఉలువలు, బబ్బెర్లతో తయారు చేసిన గుడాలు, బెల్లం పాకాన్ని ఎడ్లకు తినిపిస్తాం. పండుగ రోజున ఎడ్లతో ఎలాంటి పనులు చేయించం.
అందంగా అలంకరిస్తాం..
వ్యవసాయ పనుల్లో మాకు సాయం చేస్తున్న ఎడ్లంటే ఎంతో ఇష్టం. ఏటా ఎడ్ల పొలాల అమావాస్య పండుగను ఘనంగా జరుపుకొంటాం. ఎడ్లను శుభ్రంగా కడిగి, రకరకాల రంగులను అద్దుతాము. గజ్జెలు, గంటలతో కూడిన దండలను కట్టి అందంగా అలంకరిస్తాం.