ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు
అంగన్వాడీ భవనాలకు నిధులు మంజూరు
బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో సమీక్షలో స్పీకర్ పోచారం
బాన్సువాడ, సెప్టెంబర్ 2: మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. భగరథ ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. గురువారం ఆయన బాన్సువాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీతోపాటు మిషన్ భగీరథ అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. గ్రామాల వారీగా ఇంటింటికీ కుళాయిల బిగింపు, ట్యాంకులకు భగీరథ నీటి సరఫరా, డబుల్ బెడ్ రూం ఇండ్లకు తాగునీరు తదితర అంశాలపై గ్రామాల వారీగా సర్పంచులు, కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామాల్లో ఇంటింటికీ కుళాయిల ఏర్పాటు వందశాతం పూర్తిచేయాలని సూచించారు. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. బోరు బావుల నుంచి వచ్చే నీరు కలుషితమవుతున్నదని, దీంతో ఆరో గ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఇంటింటికీ తాగునీరు అందించే పథకం విదేశాల్లో మాత్రమే ఉన్నదని, మనదేశంలో కేవ లం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదని తెలిపారు. ఈ పథకా న్ని చూసి కేంద్రం ‘హర్ ఘర్కు జల్’ అనే నినాదంతో పథకాన్ని ప్రారంభించిందని చెప్పారు. అన్ని గ్రామాల్లో మిషన్ భగీరథ పథకాన్ని విజయవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత సర్పంచులు, కార్యదర్శులపై ఉందన్నారు. ప్రతి ఇంటికీ గంటన్నర పాటు నీటి విడుదల చేయాలని సూచించారు. బాన్సువాడ నియోజక వర్గంలోని 100 అంగన్వాడీ భవనాల నిర్మా ణం కోసం ఒక్కో భవన నిర్మాణానికి రూ. 9 లక్షలు ప్ర భుత్వం మం జూరు చేసినట్లు తెలిపారు. గ్రామాలకు సరిపడా నీటి ట్యాంకులు లేని చోట కొత్త ఓహెచ్ఆర్ నిర్మాణాలకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు ఏర్వాల కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, వైస్ చైర్మన్ షేక్ జుబేర్, ఏఎంసీ పాత బాలకృష్ణ, ఎంపీపీ దొడ్ల నీరజా వెంకట్రామ్ రెడ్డి, ఎస్ ఈ రాజేంద్ర కుమార్, మిషన్ భగీరథ అధికారులు పాల్గొన్నారు.