పునఃప్రారంభమైన స్కూళ్లు
పాఠశాలలను సందర్శించిన అధికారులు
ధర్మారం(బీ)లో విద్యార్థులతో కలిసి కలెక్టర్ ప్రార్థన
కామారెడ్డి, సెప్టెంబర్ 1: కరోనా వ్యాప్తి కారణంగా బోసిపోయిన పాఠశాలలు బుధవారం పునఃప్రారంభమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడాయి. జిల్లా, మండల స్థాయి అధికారులు జిల్లావ్యాప్తంగా పాఠశాలలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. కొవిడ్ నిబంధనలను పాటించాలని ఉపాధ్యాయులు, విద్యార్థులకు సూచించారు. ప్రత్యేకంగా నియమించిన ఉపాధ్యాయులు విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ చేసి తరగతి గదుల్లోకి అనుమతించారు. డిచ్పల్లి మండలం ధర్మారం(బీ) పాఠశాలను కలెక్టర్ నారాయణరెడ్డి సందర్శించారు. తరగతి గదులు, మరుగుదొడ్లు, వంటగదిని పరిశీలించారు. కొవిడ్ నిబంధనలను పాటించాలని సూచించారు. విద్యార్థులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. కలెక్టర్ వెంట ట్రైనీ కలెక్టర్ మకరంద్, ఎంపీడీవో మర్రిసురేందర్, తహసీల్దార్ శ్రీనివాస్‌రావు, హెచ్ఎం ఉషశ్రీ, సర్పంచ్ పత్తి మమత, ఉపసర్పంచ్ ఏలేందర్, టీచర్లు ఉన్నారు. నిజామాబాద్ నగర పరిధిలోని బోర్గాం, మాధవనగర్, దుబ్బ తదితర పాఠశాలలను జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్ తనిఖీ చేశారు. నాగారం 300 క్వార్టర్స్, జెండాగల్లీ, ఖలీల్‌వాడి పాఠశాలలను దక్షిణ మండలం తహసీల్దార్ ప్రసాద్ తనిఖీ చేశారు. మోపాల్‌లోని పాఠశాలలతోపాటు అంగన్వాడీ కేంద్రాన్ని ఆర్డీవో రవి, ధర్పల్లి మండలంలోని పాఠశాలలను తహసీల్దార్ జయంత్‌రెడ్డి, ఎంపీడీవో నటరాజ్, ఏఈవో ప్రవీణ్ తదితరులు తనిఖీ చేశారు. ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లి పాఠశాలను ఎంపీడీవో రాములునాయక్, సిరికొండ మండల కేంద్రంలోని పాఠశాలను సర్పంచ్ ఎన్నం రాజిరెడ్డి, ఆయా గ్రామాల్లోని పాఠశాలలను తహసీల్దార్ అనిల్‌కుమార్, ఎంపీడీవో లక్ష్మీప్రసాద్ తనిఖీ చేశారు. కోటగిరి మండలంలోని అంగన్వాడీ కేంద్రాలకు చిన్నారులు రాగా, నిర్వాహకులు వారికి పౌష్టికాహారం అందజేశారు. మోస్రా మండలం చింతకుంట, తిమ్మాపూర్ పాఠశాలలను ఎంపీపీ పిట్ల ఉమ, ఎంపీడీవో భారతి, తహసీల్దార్ శేఖర్, వర్ని మండల కేంద్రంతోపాటు సత్యనారాయణపురం, వడ్డేపల్లి, పాతవర్ని, హుమ్నాపూర్ పాఠశాలలను తహసీల్దార్ విఠల్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. భీమ్‌గల్ మండలంలోని ముచ్కూర్, బెజ్జోరా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను జడ్పీ సీఈవో గోవింద్ నాయక్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మౌలిక సౌకర్యాల గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీడీవో రాజేశ్వర్, సర్పంచులు ఉన్నారు. కమ్మర్పల్లి మండలంలో తహసీల్దార్ బావయ్య, ఎంఈవో ఆంధ్రయ్య, ఎంపీవో శ్రీనివాస్‌గౌడ్ పాఠశాలలను పరిశీలించారు. ఏర్గట్లలోని జడ్పీహెచ్ఎస్ను తహసీల్దార్ సురేశ్, ఎంపీపీ ఉపేందర్‌రెడ్డి, జడ్పీటీసీ రాజేశ్వర్ తనిఖీ చేశారు. బాల్కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రిన్సిపాల్ చిన్నయ్య పరిశీలించారు. మొదటి సంవత్సరం కోసం ఈ నెల 15వ తేదీ వరకు అడ్మిషన్ పొందవచ్చని తెలిపారు. కళాశాలను ప్రత్యేక అధికారి, ఎంపీడీవో, సర్పంచ్ పరిశీలించారు. బోధన్‌లోని అన్ని విద్యాసంస్థల్లో కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా అధికారులు, ఉపాధ్యాయులు ఏర్పాట్లు చేశారు. బోధన్ మండలం కల్దుర్కి, రాంపూర్ ప్రాథమిక పాఠశాలను ఎంపీపీ బుద్దెసావిత్రి సందర్శించారు. ఎంపీవో మధుకర్, డీసీసీబీ డైరెక్టర్ శరత్ ఉన్నారు. ఎడపల్లి మండలంలోని పాఠశాలను ప్రత్యేకాధికారి అశోక్ కుమార్, విద్యాధికారి రామారావు, ఎంపీడీవో శంకర్, ఎంపీవో శ్రీనివాస్ పరిశీలించారు. రెంజల్ మండలం నీలాలో జడ్పీహెచ్ఎస్ను జిల్లా ప్రణాళిక సంఘం సమన్వయ కర్త హన్మంత్‌రావు సందర్శించారు. కందకుర్తి ఉర్దూ మీడియం, తెలుగు మీడియం విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్లను తహసీల్దార్ రాంచందర్ సర్పంచ్ ఖలీంబేగ్తో కలిసి అందజేశారు. ఎంఈవో గణేశ్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్‌లో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేశ్, మండలంలో ఎంఈవో రాజగంగారాం పాఠశాలలను పరిశీలించారు. నందిపేట్ మండలం చింరాజ్‌పల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సర్పంచ్ గణేశ్, సొసైటీ చైర్మన్ గంగారెడ్డి మాస్కులు పంపిణీ చేశారు.
పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి
నవీపేట, సెప్టెంబర్ 1: కరోనాతో ఎంతో మంది తల్లిదండ్రులు మృతి చెందారని, వారి పిల్లల్లో మనోధైర్యాన్ని నింపి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా అన్నారు. నవీపేట మండలంలోని ఆభంగపట్నం, నవీపేట మోడల్ స్కూల్, ఫకీరాబాద్, మద్దేపల్లి, బినోలా గ్రామాల్లో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభం కావడంతో అదనపు కలెక్టర్ బుధవారం పరిశీలించారు. ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థులు కొవిడ్ నిబంధనలు పాటించేలా ఉపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పాఠశాలు, అంగన్వాడీ కేంద్రాల్లో శుభ్రతను పాటించాలని సూచించారు. విధి నిర్వహణలో ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులకు కరోనా గురించి అవగాహన కల్పించారు. అదనపు కలెక్టర్ వెంట ఎంపీపీ సంగెం శ్రీనివాస్, ఎంపీడీవో సయ్యద్ సాజిద్ అలీ, ఎంఈవో గణేశ్‌రావు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ నవీన్‌కుమార్, ఆయా పాఠశాల హెచ్ఎంలు ఉన్నారు.