ప్రముఖులకు జన్మనిచ్చిన గ్రామం
వేల్పూర్, సెప్టెంబర్ 22: వేల్పులు అంటే దేవతలు అని అర్థం. ఆ ఊరిలో దేవతలు నడియాడారు..అందుకే అది వేల్పుల ఊరు. కాలక్రమేణా దానిని వేల్పూర్గా పిలుస్తున్నారు గ్రామస్తులు. పూర్వం వేల్పులు కొంతకాలం కొలువై ఉండడంతో వేల్పూర్‌కు ఆ పేరు వచ్చింది. దేవతలు నడయాడినట్లు పూర్వీకులు చెప్తారు. ఈ గ్రామంలో దేవతలు కొంతకాలం ఉన్నారనడానికి గ్రామంలోని రామాలయమే నిదర్శనమని చెబుతారు. ఇది పురాతన రామాలయం, రాముడు ఇక్కడ కొంతకాలం కొలువై ఉన్నందున దీన్ని వేల్పూరుగా పిలిచారని పూర్వీకులు చెబుతారు. నాటి నుంచి నేటి వరకు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ రామాలయంలో నిత్యం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి శ్రీరామనవమికి వారం రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. గ్రామంలో 18 కులాలు ఒక కమిటీగా ఏర్పడి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి గ్రామాభివృద్ధి కమిటీగా ఏర్పడ్డారు. సూమారు రూ.25లక్షలతో వీడీసీ భవనం ఏర్పాటు చేసుకున్నారు.
వేల్పూర్ ప్రత్యేకత ఇదీ..
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో జాతీయస్థాయిలో వేల్పూర్ గ్రామం పేరొందింది. 2001 సంవత్సరంలో అధికారులు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన ఉద్యమం ఇక్కడే ప్రారంభించారు. వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం, రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా పంచాయతీకి సంబంధించిన రికార్డులు ఆన్లైన్లో పొందుపర్చడం, పల్లెప్రకృతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులతో ఉత్తమ పంచాయతీగా అవార్డులు అందుకున్నారు.
రాజకీయ రంగంలో..
వేల్పూర్ గ్రామంలో పుట్టిన వారిలో కొందరు ప్రస్తుతం వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నతస్థాయిలో ఉన్నారు. బాల్కొండ ఎమ్మెల్యే, రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ, నిజామాబాద్ తొలి మేయర్ డి.సంజయ్, బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పన్మాల హరీశ్ రెడ్డి ఈ గ్రామంలో జన్మించినవారే.
ప్రభుత్వ రంగంలో..
కస్తూర్బా పాఠశాల అడిషనల్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ పీవీ శ్రీహరి, నిజామాబాద్ డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ రమేశ్, డీఎల్పీవో పీవీ శ్రీనివాస్, సీఐ మోతీరాం, ఎస్సై వినయ్ వేల్పూర్ గ్రామానికి చెందినవారే కావడం విశేషం.