ఖలీల్‌వాడి/కామారెడ్డి, మే 23 : రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్లతోపాటు వైద్యారోగ్యశాఖ, ఇంజినీరింగ్ విభాగం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే తొమ్మిది జిల్లాల్లో న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేస్తున్నామని, దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించే హెల్త్ డే రోజున మిగితా 24 జిల్లాల్లోని అన్ని శాసనసభ నియోజకవర్గ కేంద్రాల్లో అట్టహాసంగా న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 6.84 లక్షల మంది గర్భిణులకు వీటిని అందజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేసీఆర్ కిట్‌తో మంచి ఫలితాలు వచ్చాయని, మాతాశిశు మరణాలను అరికట్టడంలో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో ఉందన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో కాన్పుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు.
ఇదే కోవలో గర్భిణుల్లో రక్తహీనతను నివారిస్తూ పుట్టబోయే శిశువులు ఆరోగ్యవంతంగా ఉండేలా ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేయాలని నిర్ణయించిందని, ఇది కూడా మంచి ఫలితాలను అందిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా హెల్త్ సెంటర్ల భవనాల నిర్మాణ ప్రగతిపై మంత్రి అడిగి తెలుసుకున్నారు. సొంత భవనాలు మంజూరు చేసిన నేపథ్యంలో అవసరమైన స్థలాలను కేటాయించాలని, నిర్మాణాలు చేపట్టినచోట గడువులోపు పనులు పూర్తయ్యేలా చొరవ చూపాలన్నారు. కంటి వెలుగు ద్వారా 80 పనిదినాల్లో రాష్ట్రవ్యాప్తంగా కోటిన్నర మందికి నేత్ర పరీక్షలు నిర్వహించి 38,54,000 మందికి కంటి అద్దాలు అందించామన్నారు. ఏ చిన్న సమస్య కూడా ఉత్పన్నం కాకుండా ఇంతపెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని, వైద్యులు, సిబ్బంది ప్రజల సహకారంతోనే ఇది సాధ్యమైందని మంత్రి చెప్పారు.
దాదాపు 90 శాతం స్క్రీనింగ్ పూర్తయినందున శిబిరాల్లో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలను సాధారణ విధుల కోసం రిలీవ్ చేయాలని సూచించారు. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేలా సూచనలు అందించాలని, పని ప్రదేశాల్లో నీడ, తాగునీరు వంటి వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచిం చారు. సీపీఆర్‌పై అందరికీ శిక్షణ అందించాలన్నారు. వీసీలో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ సుదర్శనం, కామారెడ్డిలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, డీఎంహెచ్‌వో లక్ష్మణ్‌సింగ్, బాన్సువాడ ఏరియా దవాఖాన సూపరింటెం డెంట్ శ్రీనివాస్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.