బాన్సువాడ రూరల్, జూన్ 23 : కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని మొగులాన్ పల్లి తండా గ్రామపంచాయతీ పరిధిలో గల దుంకుడు మోరి తండా ప్రాథమిక పాఠశాలను మంగళవారం జిల్లా విద్యాధికారి మల్లికార్జున్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థుల హాజరును పరిశీలించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని సూచించారు.
ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలను తప్పనిసరిగా బడిలో చేర్పించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కులను పంపిణీపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనాన్ని సక్రమంగా అమలు చేయాలని మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని సూచించారు. ఆయన వెంట గ్రామ సర్పంచ్ పూజారి, మండల విద్యాధికారి నాగేశ్వర్ రావు, గ్రామపంచాయతీ కార్యదర్శి దయానంద్ తదితరులు ఉన్నారు.