బోధన్/నందిపేట్, మార్చి 20: మహారాష్ట్రలోని కాందార్ లోహలో ఈనెల 26న బీఆర్ఎస్ సభ నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆర్మూర్, బోధన్ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, షకీల్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తుండగా.. పలువురు ప్రజాప్రతినిధులు అక్కడే మకాం వేసి పర్యవేక్షిస్తున్నారు. భారీగా జనాన్ని సమీకరించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా దేశ ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్న తెలంగాణ మాడల్‌పై విస్తృత ప్రచారం చేపట్టారు. బహిరంగసభ విజయవంతం కోసం, బీఆర్ఎస్లో అక్కడి నాయకుల చేరికల కోసం సోమవారం స్థానిక నాయకులతో సమావేశమయ్యారు. నాందేడ్ జిల్లాకు చెందిన ప్రజాతంత్రక్ పార్టీ నేత సురేశ్ దాదా ఎమ్మెల్యేలు షకీల్, జీవన్‌రెడ్డితో భేటీ అయ్యారు. బహిరంగ సభకు ప్రజలు పెద్ద సంఖ్య లో తరలివచ్చేందుకు ప్రచార వాహనాల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించేందుకు అక్కడి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు పలు సూచనలు ఇచ్చారు. గ్రామాల్లో అవగాహన కల్పించడానికి 20 ప్రచార రథాలు, 10 ఎల్ఈడీ వీడియో స్క్రీన్ వాహనాలను ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రారంభించారు. కాందార్ లోహ సభలో సీఎం కేసీఆర్ తెలంగాణ మాడల్‌పై మహారాష్ట్ర ప్రజలకు వివరిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ సభ దేశ రాజకీయాలను మలుపు తిప్పే గొప్ప చరిత్రగా మిగిలిపోతుందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్ష్ తివారీ, ప్రవీణ్ పవాడీ, అంకిత్ యాదవ్, స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.