గాంధారి : రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు చేస్తున్న అవాస్తవాలు మానుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. శుక్రవారం గాంధారి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం నల్లచట్టాలను తీసుకువచ్చి కార్పొరేట్ రంగాన్ని ప్రోత్సహించడం శోచనీయమని అన్నారు. మార్కెట్లను నిర్వీర్యం చేసి రైతులు పండించిన ఉత్పత్తులను పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటుందని ఆరోపించారు.
రైతులు ఇబ్బందులు పడకూడదనే ముఖ్యమంత్రి కేసీఆర్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం రైతుల మేలు కోరి రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలతో పాటు మరెన్నో పథకాలను అమలు చేస్తుందని వెల్లడించారు. గాంధారి మండల కేంద్రంలోని సెంటర్ లైటింగ్ రోడ్డు విస్తరణ పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. విద్యుదాఘాతంతో మృతి చెందిన మండల కేంద్రానికి చెందిన కుమ్మరి శంకర్ అనే రైతు కుటుంబానికి విద్యుత్ శాఖ తరుఫున మంజూరైన రూ. 4లక్షల చెక్కును అందజేశారు.
పేట్‌సంగెం గ్రామానికి చెందిన రవీందర్‌కు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ. 4 లక్షల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ఆయన వెంట జడ్పీటీసీ శంకర్‌నాయక్, ఎంపీపీ రాధాబలరాం, డీఎంవో గంగుబాయి, తాసీల్దార్ గోవర్ధన్, సర్పంచ్ ఫోరం మండలాధ్యక్షుడు మమ్మాయి సంజీవ్, ఏవో యాదగిరి, విండో చైర్మన్ పెద్దబూరి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.