మద్నూరు : కామారెడ్డి జిల్లా మద్నూరు మండలంలోని సలాబత్పూర్ అంతర్రాష్ట్ర రవాణా శాఖ చెక్ పోస్ట్ వద్ద ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తమ సిబ్బందితో కలిసి ఏకకాలంలో చెక్‌పోస్ట్‌పై దాడులు చేపట్టారు. గురువారం ఉదయం 10 గంటల వరకు సోదాలు కొనసాగాయి. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత కొద్ది కాలంగా చెక్‌పోస్ట్‌లో విధులు నిర్వహిస్తున్న అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని, ప్రైవేట్ వ్యక్తులను నియమించుకొని లారీ డ్రైవర్ల నుంచి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు.
దాడి చేసిన సమయంలో ఏఎంవీవైగా కవిత కానిస్టేబుల్‌గా మొయినుద్దీన్ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. తాము సోదాలు నిర్వహిస్తున్న సమయంలో అక్కడ వీరు ఏర్పాటు చేసుకున్న ఓ బాక్స్‌లో 39 వేల రూపాయలు లారీ డ్రైవర్లు తమకు తాముగా వేశారని తెలిపారు. ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులలో ఒకరి వద్ద 28,000 మరొకరి వద్ద 24 వేల రూపాయలు మొత్తం ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పి వెల్లడించారు. ఈ నివేదికలను ఉన్నతాధికారులకు పంపించి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. సోదాల్లో ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, నాగేష్, వేణు కుమార్ ఉన్నారు.