నిజాంసాగర్/ ఎల్లారెడ్డి రూరల్, నవంబర్ 29 : బృహత్ ప్రకృతి వనాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ జితేశ్ పాటిల్ అన్నారు. నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామశివారులో పది ఎకరాల స్థలంలో ఏర్పాటు చేస్తున్న బృహత్ ప్రకృతివనాన్ని ఆయన సోమవారం పరిశీలించారు. ప్రకృతివనంలో నాటిన మొక్కల వివరాలు, రోజూ ఎంతమంది కూలీలు మొక్కలు నాటేందుకు వస్తున్నారు, నీటి వసతి తదితర వివరాలను అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. మొత్తం 21 వేల మొక్కలు నాటారని, మరో 8 వేల మొక్కలను నాటాలని సూచించామని తెలిపారు. బృహత్ ప్రకృతివనంలో వాటర్ ఫౌంటేన్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఆర్డీవో రాజాగౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దుర్గారెడ్డి, ఎంపీడీవో పర్బన్న, తహసీల్దార్ నారాయణ, ఎంపీవో అబ్బాగౌడ్, ఏపీవో శ్రీనివాస్, సర్పంచ్ అనసూయ, నాయకులు సత్యనారాయణ, రమేశ్ కుమార్, సాంకేతిక సహాయకులు చందు, ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి రాజయ్య ఉన్నారు.
ఎల్లారెడ్డి మండల పరిధిలోని మాచాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన బృహత్ ప్రకృతివనాన్ని కలెక్టర్ జితేశ్ పాటిల్ పరిశీలించారు. ఇప్పటివరకు నాటిన మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బృహత్ ప్రకృతివనాలను పది ఎకరాల చొప్పున ఏర్పాటు చేస్తున్నామని, మాచాపూర్‌లో ఏడున్నర ఎకరాల్లో ఏర్పాటు చేశారని తెలిపారు. ఇప్పటివరకు సుమారు 11 వేల మొక్కలు నాటారని తెలిపారు. మరో 15 వేల మొక్కలను నాటాలని సూచించారు. ప్రకృతివనం చుట్టూ కంచెకు బదులుగా నీలగిరి, టేకు, వెదురు తదితర మొక్కలను దగ్గరగా నాటాలని సలహాఇచ్చారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎంపీడీవో మల్లికార్జున్‌రెడ్డి, ఎంపీవో అతినారపు ప్రకాశ్, గిర్దావర్ అహ్మద్, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఏపీవో సక్కుబాయి, పంచాయతీ కార్యదర్శి రమేశ్ ఉన్నారు.