ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తప్పనిసరి
నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి
నిజామాబాద్‌సిటీ, నవంబర్ 29: కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రమాదకరంగా విస్తరిస్తున్న నేపథ్యంలో జిల్లాలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రగతిభవన్ సమావేశం మందిరంలో వైద్య, మున్సిపల్ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త వేరియంట్‌తో ప్రపంచ దేశాలు భయపడుతున్నాయని, ఇందులో భాగంగా జిల్లాలోని 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరూ రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. మొదటి డోస్ తీసుకోని వారిలో అనుమానాలు ఉంటే స్థానిక నాయకులతో నివృత్తి చేయించాలన్నారు. కరోనాతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు ఎక్స్‌గ్రేషియా కోసం చేసుకునే దరఖాస్తులను పరిశీలించి డీఎంహెచ్‌వోకు పంపించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ చిత్రామిశ్ర, అధికారులు సుదర్శనం ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.