యాసంగిలో ధాన్యం కొనుగోళ్లు ఉండవు
ప్రభుత్వం చెప్పినట్లు చేస్తే వరి కన్నా అధిక లాభాలు
బీజేపీ రూపంలో యాసంగి సాగునూ వెంటాడుతున్న ప్రమాదం
గ్రామాల్లో రైతులను తప్పుదోవ పట్టిస్తున్న కమలం నేతలు
నిజామాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ధాన్యం సేకరణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొర్రీలు పెడుతుంటే.. స్థానిక కమలం పార్టీ నేతలు మాత్రం వరి పంటే సాగు చేయాలంటూ రైతుల్ని గందరగోళంలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం వ్యవహారశైలి కారణంగా రాష్ట్రప్రభుత్వం అన్నదాతలు నష్టాల పాలుకాకుండా వరికి బదులుగా ఇతర పంటలు సాగుచేసేలా ప్రోత్సహిస్తున్నది. కేంద్రం పెడుతున్న కిరికిరితో యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోమంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రైతులెవరూ వరి సాగు చేయొద్దంటూ వ్యవసాయ శాఖ ఇప్పటికే అవగాహన కల్పిస్తున్నది. కానీ జిల్లాలో బీజేపీ నాయకుల మాత్రం రైతుల్ని ఇరకాటంలోకి నెట్టుతున్నారు. వరి సాగు చేయాలని, ప్రభుత్వం ఎలా కొనబోదో చూద్దామంటూ రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ నేతల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిజామాబాద్ జిల్లాలో బీజేపీకి చెందిన శ్రేణుల తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. నిత్యం రెచ్చగొట్టే ప్రకటనలతో పబ్బం గడుపుకునే ఆ పార్టీ ముఖ్య నేతల బాటలోనే కింది స్థాయి శ్రేణులు సైతం నడుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ కక్ష పూరిత విధానాల నేపథ్యంలో తెలంగాణలో వరి పంట సాగుకు బ్రేక్ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రైతులకు నష్టాలు ఎదురుకాకూడదని ప్రభుత్వం కొంత కాలంగా వరి సాగుకు నో చెబుతోంది. బీజేపీకి చెందిన వారు మాత్రం ఇందుకు భిన్నంగా రైతులను వరి సాగుకు ఉసి గొల్పుతున్నారు. పంటలను సాగు చేయాలంటూ తెర వెనుక కక్షపూరితమైన రాజకీయాలకు ఒడిగడుతున్నారు. వారి స్వార్థ్య ప్రయోజనాల కోసం రైతులను బలి చేసే ప్రణాళికను ముందుకు తీసుకురావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఆదర్శవంతమైన సేద్యానికి పెట్టింది పేరుగా నిలిచిన ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో బీజేపీకి చెందిన వ్యక్తులు నేరుగా రైతులను పక్కదారి పట్టిస్తుండడం చర్చనీయాంశం అవుతోంది. రాజకీయ పార్టీకి చెందిన నాయకులకు బాధ్యత ఉంటే కర్షకులను వరి సాగు ఊబి నుంచి బయటకు తీసుకు రావాలి. కానిక్కడ అందుకు భిన్నంగా రైతును నష్టాల్లోకి నెట్టేందుకు, యాసంగి సీజన్ ముగింపు నాటికి వచ్చే ధాన్యంతో రైతులు రోడ్డున పడేలా బీజేపీ నేతలు ప్రవర్తిస్తుండడం విడ్డూరంగా మారింది.
యాసంగిలో కేంద్రాలుండవు…
తెలంగాణ రాష్ట్రం రాక మునుపు ధాన్యం కొనుగోలు కేంద్రాలు కనిపించేవి కావు. ప్రభుత్వం అస్సలు పట్టించుకునేదే కాదు. సీఎం కేసీఆర్ స్వయాన రైతు బిడ్డ కావడంతో కర్షకుల గోసను కళ్లారా చూసిన అనుభవంతో ప్రభుత్వమే చొరవ తీసుకుని ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిచారు. రూ.వేల కోట్లు వెచ్చించి రైతులకు కనీస మద్దతు ధరను కల్పించారు. ఏడేండ్లుగా నిర్వఘ్నంగా సాగుతున్న పంట ఉత్పత్తుల సేకరణకు కేంద్ర ప్రభుత్వం తీరుతో ఆటంకాలు ఎదురవ్వడం మొదలైంది. సాఫీగా రైతుకు లాభదాయకంగా సాగుతున్న ప్రక్రియను ఆగమాగం చేయడం మూలంగా వరి పంట సాగు ప్రశ్నార్థకమైంది. రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్రం సేకరించి బియ్యంగా మార్చి కేంద్రానికి ఇస్తుంటే బీజేపీ ప్రభుత్వం ససేమిరా అనడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మూడు సీజన్లుగా ఎదురవుతున్న విపత్కర దుస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కేంద్రంతో కొట్లాడుతున్నప్పటికీ బీజేపీ ప్రభుత్వంలోని పెద్దలు కనీసం పట్టించుకోవడం లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితిలో ఈ యాసంగిలో వరి బదులుగా ఇతర పంటలను సాగు చేయడం అనివార్యమైంది. రాష్ట్ర ప్రభుత్వం సైతం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోమని వెల్లడించిన నేపథ్యంలో రైతులెవ్వరూ వరి సాగు చేయొద్దంటూ వ్యవసాయ శాఖ ఇప్పటికే అవగాహన కల్పిస్తోంది.
వరి వేసి మునుగొద్దు…
బీజేపీని నమ్మొద్దు… వరి వేసి మునుగొద్దు… అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి రైతులకు అవగాహన కల్పిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను సామాన్యుల చెంతకు తీసుకుపోతోంది. సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ఆరుతడి పంటలను సాగు చేయాలని ప్రచారం చేస్తున్నారు. బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని అదే రీతిలో తిప్పి కొడుతూ… రైతులకు అండగా నిలుస్తున్నారు. మరోవైపు వ్యవసాయ శాఖ సైతం ప్రత్యేకంగా బ్రోచర్లు తయారు చేసి గ్రామ పంచాయతీల్లో, ప్రభుత్వ కార్యాలయాల గోడలపై పోస్టర్లు అతికించబోతున్నది. భూగర్భ జలాలు, జలాశయాల్లో నీళ్లను ఆధారంగా చేసుకుని ఈ యాసంగిలో రైతులు భారీగా పంటలు సాగు చేయనున్నారు. వ్యవసాయ శాఖ గణాంకాల మేరకు గతేడాది యాసంగిలో నిజామాబాద్ జిల్లాలో 3లక్షల 4వేల 398 ఎకరాల్లో వరి సాగుకు నోచుకున్నది. దాదాపుగా ఎనిమిదిన్నర లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనాలుండగా ప్రభుత్వం దాదాపుగా 7.43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. మిగిలిన ధాన్యాన్ని రైతులే నేరుగా ప్రైవేటుకు కొనుగోలు చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈసారి యాసంగిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనుగోళ్లకు అవకాశం లేకపోవడంతో వరి సాగును పూర్తి స్థాయిలో నియంత్రించాలని సర్కారు భావిస్తోంది. కేవలం విత్తనాల కోసమైతేనే సాగు చేయాలంటూ చెబుతోంది.