గతేడాదితో పోలిస్తే తగ్గిన క్రైం రేట్
మెరుగ్గా రికవరీ శాతం
పెరిగిన మట్కా, గుట్కా, గంజాయి కేసులు
600 శాతం పెరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
వివరాలను వెల్లడించిన సీపీ కేఆర్. నాగరాజు
నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 28 : నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో గతేడాది కన్నా ఈ సారి నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టగా.. మట్కా, గుట్కా, గంజాయి కేసుల సంఖ్య పెరిగింది. నిజామాబాద్ కమిషనరేట్‌లో సీపీ కేఆర్.నాగరాజు మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జిల్లాలో ఈ ఏడాది నమోదైన నేరాల వివరాలను వెల్లడించారు. 2019-20 సంవత్సరంతో నమోదైన కేసుల కన్నా 2020-21 సంవత్సరంలో కేసులు తగ్గాయని, గతేడాది రికవరీ శాతం 41 ఉండగా.. ఈ ఏడాది 60 శాతానికి పెరిగిందని తదెలిపారు. దోపిడీ దొంగతనాలు, మర్డర్లు, లైంగికదాడి తదితర కేసులు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. జిల్లాలో ఈ ఏడాది మట్కా కేసు సంఖ్యతోపాటు గుట్కా, గంజాయి అక్రమ రవాణా పెరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పోలీసులు ఊహించని విధంగా పెరిగాయన్నారు. గతేడాది జిల్లావ్యాప్తంగా 634 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా.. ఈ ఏడాదిలో 4,226 కేసులు నమోదయ్యాయని తెలిపారు. 2020లో 173 చోరీలు జరిగితే ఈ ఏడాది 156 జరిగాయని వెల్లడించారు. గతంలో 29 చైన్‌స్నాచింగ్ సంఘటనలు జరగగా.. ఈ ఏడాది 23 కేసులు నమోదయ్యాయని తెలిపారు. మట్కా, గుట్కా, గంజాయి, ఇసుక అక్రమ రవాణా కేసులు పెరగగా.. లైంగికదాడి కేసులు తగ్గాయని చెప్పారు. ప్రాపర్టీ రికవరీ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పెరిగిందని, పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నామని సీపీ తెలిపారు. విలేకరుల సమావేశంలో అదనపు డీసీపీ లా అండ్ ఆర్డర్ వినీత్, అడిషనల్ డీసీపీ ఉషా విశ్వనాథ్, అదనపు డీసీపీ ఏఆర్ గిరిరాజు, ఏసీపీలు వెంకటేశ్వర్లు, ప్రభాకర్, రఘు పాల్గొన్నారు.
న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం
జిల్లాలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడంపై నిషేధం విధించామని సీపీ కేఆర్ నాగరాజు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు కొత్త సంవత్సరాల సంబురాలు నిర్వహించుకునేందుకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టంచేశారు. నిబంధనలకు విరుద్ధంగా నూతన సంవత్సర వేడుకలను నిర్వహించే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.