రైతుపేరిట నకిలీ ట్రక్‌షీట్ తయారీ..
గుర్తించిన సదాశివనగర్ విండో సీఈవో, చైర్మన్
గ్రామసభలో విచారణ.. బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు
రూ. రెండు లక్షల జరిమానా విధించిన గ్రామస్తులు
సదాశివనగర్, డిసెంబర్ 28: నకిలీ ట్రక్‌షీట్ సృష్టించి ఓ రైతు పేరుమీద ధాన్యం డబ్బులను కాజేసేందుకు కొందరు చేసిన యత్నాన్ని సదాశివనగర్ విండో సీఈవో విఘ్నేష్ గౌడ్, చైర్మన్ వరికెల కమలాకర్ రావు గుర్తించారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొడిప్యాక శ్రీనివాస్ సూచన మేరకు సదాశివనగర్ విండోలో దినసరి వేతనంపై పని చేస్తున్న సుంకరి నరేశ్.. గ్రామానికి చెందిన నాయిని సాయన్న పేరుమీద నకిలీ ట్రక్షీట్నుతయారుచేశాడు. దీనిని గుర్తించిన విండో సీఈవో విఘ్నేష్ గౌడ్, చైర్మన్ వరికెల కమలాకర్ రావు మంగళవారం గ్రామంలో సభ ఏర్పాటు చేసి విచారించారు. గ్రామానికి చెందిన వంగిటి సంతోష్‌రెడ్డి ట్రాక్టర్లో 200 బస్తాల ధాన్యాన్ని (రూ. లక్షా 56 వేల 800) తరలించినట్లు నకిలీ ట్రక్‌షీట్ తయారుచేసి, బిల్లును కొడిప్యాక శ్రీనివాస్ తీసుకోవడానికి ప్రయత్నించినట్లు విండో చైర్మన్ చెప్పారు. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. దీనిపై కొందరు కావాలని సామాజిక మాధ్యమాల్లో ఎమ్మెల్యే అనుచరులు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనిని ఖండిస్తున్నట్లు చెప్పారు. గ్రామస్తులు శ్రీనివాస్‌కు రూ. 2 లక్షల జరిమానా విధించారన్నారు. జరిమానా డబ్బులను విండో లో చెల్లించాలని సూచించారన్నారు. అనంతరం పోలీసులు కొడిప్యాక శ్రీనివాస్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిపించడంతో గ్రామస్తులు శాంతించారు.