పసుపు బోర్డు ఏదంటూ నిలదీతలు
గో బ్యాక్ అంటూ నినాదాలు
రైతులపైకి దూసుకెళ్లిన కారు…!
అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
కాన్వాయ్‌లోని వాహనం
తగిలి హోంగార్డుకు గాయాలు
నిజామాబాద్, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ డిచ్పల్లి / ఇందల్వాయి, డిసెంబర్ 26 : పసుపు బోర్డు విషయంలో మాట తప్పిన ఎంపీ అర్వింద్‌కు నిరసన సెగ తప్పడం లేదు. ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి సోమవారం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన ఎంపీని ప్రజలు, రైతులు, టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ డిమాండ్ చేశారు. గోబ్యాక్ నినాదాలతో హోరెత్తించారు. దీంతో అసహనానికి గురైన ఎంపీ కారును పోనివ్వాలని డ్రైవర్‌కు సూచించడంతో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపైకి కారు దూసుకొచ్చింది. అందరూ అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. తన అనుచరులను రెచ్చగొట్టడంతో శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై దాడులకు దిగారు. బీజేపీ శ్రేణుల దాడిలో పలువురు రైతులు, టీఆర్ఎస్ నాయకులకు గాయాలయ్యాయి. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. ఎంపీ కాన్వాయ్‌లోని ఓ వాహనం తగలడంతో హోంగార్డు కాలికి గాయమైంది.
ఢిల్లీలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న రైతులపైకి కేంద్రమంత్రి కొడుకు కారుతో ఢీకొట్టి చంపిన ఘటనను మరువకముందే అలాంటిదే నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇక్కడ కూడా కారుతో దూసుకెళ్లింది ఎవరో కాదు… బీజేపీకి చెందిన ఎంపీయే. తనను ఎంపీగా గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పి, ముఖం చాటేశాడని ఆరోపిస్తూ అర్వింద్‌ను ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలో ప్రజలు, రైతులు, టీఆర్ఎస్ నాయకులు అడ్డగించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అసహనానికి గురైన బీజేపీ ఎంపీ ఏకంగా రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు, స్థానిక ప్రజలపైకి కారు దూసుకెళ్లేలా డ్రైవర్‌ను పురమాయించాడు. దీంతో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపైకి కారు దూసుకొచ్చింది. వారంతా అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. అబద్ధపు హామీలతో గెలిచిన అర్వింద్ దాదాపు మూడేండ్లుగా ముఖం చూపకుండానే తప్పించుకొని తిరుగుతున్నాడని, ఇదే సమయంలో గన్నారం గ్రామానికి ఎంపీ వస్తున్నాడనే సమాచారంతో ప్రజలు, రైతులు గుమిగూడి నిరసన వ్యక్తం చేశారు. దీంతో సమాధానం చెప్పకుండానే ఎంపీ తప్పించుకొని పారిపోవడం విమర్శలకు తావిస్తున్నది.
మోసకారి అర్వింద్ డౌన్‌డౌన్..
“అరగుండు గోబ్యాక్… మోసకారి అర్వింద్ డౌన్ డౌన్…” అనే నినాదాలతో 44వ నంబర్ జాతీయ రహదారి దద్దరిల్లింది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పర్యటన తీవ్ర నిరసనల మధ్య సాగింది. వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, సీసీ రోడ్ల ప్రారంభోత్సవానికి వచ్చిన అర్వింద్‌ను గ్రామస్తులు, స్థానికులు పెద్దఎత్తున అడ్డగించారు. అర్వింద్ కాన్వాయ్‌ను వెంబడించి, 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు. గో బ్యాక్ అంటూ నినదించడంతోపాటు జాతీయ రహదారి వెంట ఎంపీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ప్రదర్శించారు. పసుపు బోర్డు ఏర్పాటుపై రాసిచ్చిన బాండ్ పేపర్‌తో రైతులు సైతం ఎంపీని నిలదీసేందుకు రావడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఊహించని విధంగా నిరసనలు వ్యక్తం కావడంతో నిజామాబాద్ ఎంపీ ఆగమాగం అయ్యారు. తన అనుచరులను రెచ్చగొట్టి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై దాడులకు పురమాయించాడు. బీజేపీ శ్రేణులు రౌడీ మూకల మాదిరిగా దాడులు చేయడంతో పలువురు రైతులు, టీఆర్ఎస్ నాయకులకు గాయాలయ్యాయి. పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
ఏసీపీతోపాటు టీఆర్ఎస్ నాయకులకు గాయాలు
ఎంపీ అర్వింద్ కాన్వాయ్‌ని అడ్డుకున్న రైతులు, ప్రజలు, టీఆర్ఎస్ నాయకులను కట్టడి చేసే క్రమంలో తీవ్రమైన తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఏసీపీ వెంకటేశ్వర్ కిందపడగా కుడిచేతి వేళ్లకు గాయాలయ్యాయి. డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ఎంపీపీ రమేశ్ నాయక్, వైస్ ఎంపీపీ అంజయ్య, విండో చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ పాశంకుమార్లకు సైతం గాయాలయ్యాయి. అనంతరం సుమారు 15మంది టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను పోలీసులు అరెస్టు చేశారు.
టీఆర్ఎస్ నాయకులపై దాడి అమానుషం
రైతుల సమస్యలను పరిష్కరించాలని శాంతియుతంగా నిరసన తెలియజేస్తే బీజేపీ గుండాలు తమపై దాడి చేయడం సిగ్గుచేటని డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ఎంపీపీ రమేశ్ నాయక్, టీఆర్ఎస్ నేతలు అన్నారు. హామీలు నెరవేర్చకుంటే ఎంపీ అర్వింద్‌ను గ్రామాల్లో కాలు పెట్టనివ్వబోమని స్పష్టం చేశారు.
ప్రారంభించిన వాటికే ప్రారంభోత్సవం..
గన్నారంలో నిర్మించిన వైకుంఠధామం, పల్లె ప్రకృతివనం, సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం ఉదయం 9గంటలకే పూర్తయ్యింది. స్థానిక ప్రజా ప్రతినిధులంతా కలిసి అధికారులతో కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో నిర్మితమైన వాటన్నింటినీ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది జీర్ణించుకోలేకపోయిన బీజేపీకి చెందిన స్థానిక సర్పంచ్ పోటీగా మరోసారి కార్యక్రమం నిర్వహించడంతో ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడింది. సమయానికి రావాల్సిన ఎంపీగా నిర్లక్ష్యం వ్యవహరించి, కావాలనే గొడవలు సృష్టించాలని ఆలస్యంగా వచ్చాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లేకలేక ప్రజల్లోకి వస్తున్న ఎంపీని ఎలాగైన ప్రశ్నించాలని నిర్ణయించుకున్న రైతులంతా అర్వింద్ ఇచ్చిన హామీలను గుర్తు చేసుకుంటూ అడుగడుగునా అడ్డగించారు. గన్నారం గ్రామానికి పైసా నిధులివ్వని ఎంపీ ఎందుకు వస్తున్నాడంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో బీజేపీ నేతలంతా కంగుతిన్నారు. గన్నారం గ్రామానికి చెందిన పలువురు రైతులు నేరుగా ఎంపీని కలిసి వినతిపత్రం అందజేసి, హామీని నిలబెట్టుకోవాలంటూ అడగాలని ప్రయత్నించినప్పటికీ అర్వింద్‌కు ముఖం చెల్లుబాటు కాకపోవడంతో వెనుదిరిగాడు. కనీసం వాహనం కిటికీ అద్దం కూడా దించకుండానే వచ్చిన దారిలో రిటర్న్ కావడం కనిపించింది. ఉదయమే ప్రారంభమైన అభివృద్ధి కార్యక్రమాలను తిరిగి ప్రారంభోత్సవాలు చేసి ఎంపీ తనంతట తానే పరువు తీసుకున్నారని స్థానికులంతా కోడై కూస్తున్నారు.