నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 26: ప్రజల సహకారంతో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణకు కృషి చేస్తామని సీపీ నాగరాజు అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఆదివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు సీపీగా విధులు నిర్వర్తించి బదిలీ అయిన కార్తికేయ నుంచి సీపీ నాగరాజు బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మాట్లాడారు. లా అండ్ ఆర్డర్ పరిస్థితులపై లీగల్‌గా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో నేరాలు, దోపిడీ, దొంగతనాల కేసులను చేధిస్తామని చెప్పారు. ఇతర ప్రాంతాలకు చెందిన నేరస్థులు ఎక్కువగా వస్తున్నారని తెలిసిందని, ఇంటలిజెన్స్ సహకారంతో వారినీ అరికడతామని వివరించారు. విలేకరుల సమావేశంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) ఉషా విశ్వనాథ్, ఏఆర్ డీసీపీ గిరిరాజు పాల్గొన్నారు. సీపీగా బాధ్యతలు చేపట్టిన నాగరాజును పలువురు సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీపీ కమిషనరేట్ కార్యాలయంలోని వివిధ విభాగాలను సందర్శించారు. ఇదిలా ఉండగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లికి చెందిన కేఆర్ నాగరాజు 1989 జనవరి 16న పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన వరంగల్ ఈస్ట్‌జోన్ డీసీపీగా, రాచకొండ క్రైం డీసీపీగా, హైదరాబాద్ సీఐడీ ఎస్పీగా పనిచేసి నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌గా బదిలీపై వచ్చారు.