నిజామాబాద్ జిల్లాకు వచ్చిన 67వేల చీరలు
పోచంపల్లి, కోయల్‌కొండ, సిరిసిల్ల, మహబూబ్‌నగర్ నుంచి 32 రకాల డిజైన్లతో చీరలు
సుమారు 5లక్షల మందికి అందనున్న సర్కారు కానుక
ఖలీల్‌వాడి, ఆగస్టు 23: బతుకమ్మ సారె ఈసారి ముందుగానే జిల్లాకు చేరింది. ఏటా బతుకమ్మ పండుగ కోసం ఆడబిడ్డలందరికీ రాష్ట్రప్రభుత్వం చీరలను పంపిణీ చేస్తున్నది. నిజామాబాద్ జిల్లాకు సోమవారం 67వేల బతుకమ్మ చీరలు వచ్చాయి. వారం రోజుల్లో పూర్తిస్థాయిలో చీరలు చేరుతాయని అధికారులు చెబుతున్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగకు రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు అందించే సారె జిల్లాకు చేరుకున్నది. ప్రతి ఏటా బతుకమ్మ పండుగ వస్తుందనగానే ఆడబిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెద్దన్నగా సీఎం కేసీఆర్ చీరలను ఇంటింటికీ పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో తెల్లరేషన్ కార్డు ఉండి 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతికీ ఈ చీరలను అందించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 5,03, 917 చీరలను పంపిణీ చేయనున్నారు. రెండు నెలల ముందుగానే జిల్లాలో పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభు త్వం సిద్ధమైంది. కాగా జిల్లాకు సోమవారం 67వేల చీరలు వచ్చాయి. మంగళవారం మరో లక్ష, బుధ, గురువారాల నాటికి మొత్తం మిగిలిన చీరలన్నీ జిల్లాకు చేరనున్నాయి. ఆర్మూర్‌లో 1,90,043 మంది అర్హులు ఉండగా ప్రస్తుతం 25వేల చీరలు, బోధన్‌లో 1,26,931 మందికి చీరలు పంపిణీ చేయాల్సి ఉండగా 17వేలు, నిజామాబాద్ అర్బన్‌లో 2,53,943 మందికి గాను 25వేల చీరలు గోదాముకు వచ్చి చేరాయి.
త్వరలోనే బతుకమ్మ చీరల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆడబిడ్డలకు బతుకమ్మ కానుకగా అందించాలని సీఎం కేసీఆర్ ఐదేండ్ల క్రితం శ్రీకారం చుట్టారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకోవాలని, నిరుపేదలు, బడుగు బలహీన వ ర్గాల వారీకి, చీరలను కొనుగోలు చేసేందుకు డబ్బులు లేని వారు బాధపడొద్దనే ఉద్దేశంతో ఈ ఇంటింటి సారే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే డివిజన్ల వారీగా బతుకమ్మ చీరలు రావడంతో కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు మండలాలు, మున్సిపాలిటీల వారీ గా పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యా రు. ప్రతి ఏడాది దసరాకు రెండు నెలల ముందు నుంచే బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. ఆహార భద్రత కార్డులున్న కుటుంబాలకు చీరలు అందించనున్నారు.