నగరంలో ‘సుప్రీంకోర్టు రోడ్ సేఫ్టీ కమిటీ’ పర్యటన
జిల్లా పోలీసు, డీటీసీ కార్యాలయంలో సమావేశం
ప్రమాదాల నియంత్రణ తదితర అంశాలపై వివరాలను తెలుసుకున్న అధికారులు.. క్షేత్రస్థాయిలో పరిశీలన
ఇందూరు/ ఖలీల్‌వాడి, ఆగస్టు 23 : జిల్లా కేంద్రంలో సోమవారం ‘సుప్రీంకోర్టు కమిటీ ఆన్ రోడ్ సేఫ్టీ’ పర్యటించింది. ఢిల్లీ నుంచి వచ్చిన బృందం పోలీసు కార్యాలయంతోపాటు ఆర్టీవో కార్యాలయాలకు వెళ్లి వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించింది. పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌లో హాలులో డీసీపీ అరవింద్ బాబు ఆధ్వర్యంలో ప్రాజెక్టు కన్సల్టేషన్ ఫర్ సుప్రీంకోర్డు కమిటీ ఆన్ రోడ్డు సెప్టీ ఇంప్లిమెంటేషన్ స్టేటస్ ఆడిట్ నిర్వహించారు. ఇందులో పోలీసులు అధికారులతోపాటు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా బృందం సభ్యులు పోలీసు డిపార్ట్మెంట్ తీసుకుంటున్న రోడ్డు సేఫ్టీ అంశాలను పరిశీలించారు. కమాండ్ కంట్రోల్లో సీసీ కెమెరాలు ఏవిధంగా పని చేస్తున్నాయో తెలుసుకున్నారు. ట్రాఫిక్ చలాన్ల నిర్వహణ, మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి కౌన్సెలింగ్ వివరాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలు, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని ఏ విధంగా చెక్ చేస్తారో ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఇంటర్ సెఫ్టర్ వాహనం పని తీరు, బ్లాక్ స్పాట్ ప్రదేశాలను సందర్శించి రోడ్డు భద్రతా చర్యలు ఏవిధంగా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీటీసీ కార్యాలయాన్ని సం దర్శించారు. డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల ఫిటినెస్ పరిశీలనతోపాటు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డీటీసీ వెంకటరమణారెడ్డికి సూచనలు చేశారు. రోడ్డు సెప్టీ అంశాలను పరిశీలించారు. బృందంలో కమిటీ ప్రాజెక్టు కన్సల్టేషన్ హెడ్ కిరణ్ కుమార్ ఈగ, అసిస్టెంట్ మేనేజర్ బన్షీ శర్మా, ఎగ్జిక్యూటివ్ ట్రైనీలు నళిన్, విష్ణు, శుభమ్, ట్రాఫిక్ ఏసీపీ ఆర్.ప్రభాకర్‌రావు, ఏసీపీ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్, సిబ్బంది ఉన్నారు.