కామారెడ్డి టౌన్, డిసెంబర్ 21: పట్టణంలోని కాకతీయనగర్, డ్రైవర్స్ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మంగళవారం పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో బలహీనంగా ఉన్న పిల్లల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారి బరువును తూకం వేయించారు. ఎత్తుకు తగిన విధంగా బరువు ఉండేలా పిల్లలకు నాలుగు నెలలపాటు అదనపు ఆహారం ఇవ్వాలని సూచించారు. బలహీనంగా ఉన్న గర్భిణులకు అదనంగా పౌష్టికాహారం అందించాలని ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. కాకతీయనగర్లోని ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా శిశు, మహిళా, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ అధికారిణి సరస్వతి, పర్యవేక్షకులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇంధన పొదుపుపై ప్రచార రథం ప్రారంభం
కామారెడ్డి టౌన్, డిసెంబర్ 21: కామారెడ్డి సమీకృత కార్యాలయాల సముదాయం వద్ద మంగళవారం ఇంధన పొదుపుపై అవగాహన ప్రచార రథాన్ని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ జెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలోని గ్రామాల్లో ఇంధన పొదుపుపై అవగాహన కల్పిస్తారని చెప్పారు. సోలార్ ద్వారా విద్యుత్ వాడకంతో కలిగే ప్రయోజనాలను తెలియజేస్తారని పేర్కొన్నారు. టీఎస్ రెడ్ కో జిల్లా మేనేజర్ బి.గంగాధర్, ప్రతినిధులు ఉదయ్, అరుణ్ కుమార్, జగదీప్ రామ్ పాల్గొన్నారు.