ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు
నిజామాబాద్ జిల్లాలో 54,878 ఎకరాల భూములు అనుకూలం
కామారెడ్డిలో 65,052 ఎకరాల గుర్తింపు
8,039 ఎకరాల్లో సాగుకు 2178 మంది దరఖాస్తు
కామారెడ్డి, నవంబర్ 21;రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టింది. వడ్లు కొనుగోలు చేయలేమని కేంద్రం స్పష్టంగా చెప్పడంతో… ఆ దిశగా వాణిజ్య పంటలను సాగు చేయాలని రైతులను ప్రోత్సహిస్తున్నది. ఈ క్రమంలో వంట నూనెలను ఉత్పత్తి చేసే ఆయిల్‌పామ్ సాగు వైపు మళ్లించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. నాటేందుకు అవసరమయ్యే మొక్కలను సబ్సిడీగా అందిస్తున్నది. అంతేకాక మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంతోపాటు రవాణా ఖర్చులు చెల్లించి రైతులకు అండగా నిలుస్తున్నది. కామారెడ్డి జిల్లాలో వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్ సాగుకు నేలలు అనుకూలంగా ఉండడంతో ఇక్కడి రైతులు సాగు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. మరోవైపు రైతులను ప్రోత్సహించేందుకు ఉద్యానవన శాఖ అధికారులు అడుగులు వేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆయిల్‌పామ్ సాగుకు ఉన్న భూములను గుర్తించారు. కామారెడ్డి జిల్లాలో 65,052 ఎకరాలు, నిజామాబాద్ జిల్లాలో 54,878 ఎకరాలు ఆయిల్‌పామ్ సాగుకు అనువుగా ఉన్నాయి.
కామారెడ్డి జిలా పరిధిలో 22 మండలాల పరిధిలో ఆయిల్‌పామ్ పంట సాగు చేసే రైతుల జాబితాను సంబంధిత ఉద్యానవన శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది. జిల్లా పరిధిలో 65,052 ఎకరాల భూములు అనుకూలంగా ఉండగా 8039 ఎకరాల్లో 2178 మంది రైతులు ఆయిల్‌పామ్ సాగు చేసేందుకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. నస్రుల్లాబాద్ మండలంలోని బొప్పాస్పల్లి గ్రామంలో ఇప్పటికే 3 ఎకరాల్లో ఆయిల్ పామ్‌ను రెండేండ్ల నుంచి సాగు చేస్తున్నారు. అప్పటి వ్యవసాయశాఖ మంత్రి, ప్రస్తుత స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బొప్పాస్‌పల్లిలో ప్రభుత్వపరంగా ఉద్యానవన శాఖ నుంచి ఆయిల్‌పామ్ సాగుకు బీజం వేశారు. మొదటి ఏడాది కావడంతో ఆయిల్‌పామ్‌ను ప్రోత్సహించడానికి కసరత్తు ప్రారంభించారు. యాసంగిలో ఆయిల్‌పామ్ పంట సాగుకు ముందుకు వస్తున్న రైతుల జాబితా సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది వరకు 1500 నుంచి 2000 ఎకరాల పంట కోసం ఉద్యానవన శాఖ నుంచి ప్రయత్నాలు సాగిస్తున్నారు. విడుతల వారీగా 1500 ఎకరాల చొప్పున రెండేండ్లలో పూర్తిస్థాయిలో 8వేల ఎకరాల సాగు లక్ష్యం పెట్టుకొని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. విస్తీర్ణం పెంచాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున రాయితీలు కల్పిస్తున్నది. నర్సరీలో పెంచే మొక్కలను కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా పరిధి రైతులకు అందించబోతున్నారు.
రాంపూర్ శివారు నర్సరీలో మొక్కల పెంపకం..
ఉమ్మడి నిజామాబాద్‌కు సంబంధించి ఆయిల్‌పామ్ మొక్కలను డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామ శివారులోని విశ్వతేజ ఆయిల్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో మొక్కలను పెంచుతున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు సంబంధించిన రైతులకు రాంపూర్‌లో ఉన్న నర్సరీ నుంచి మొక్కలను అందించనున్నారు. కామారెడ్డి జిల్లాకు సంబంధించి లక్షా10వేల మొక్కలను ఈ నర్సరీలో పెంచుతున్నారు. 22 మండలాల పరిధిలో రెండేండ్ల వ్యవధిలో మొదటి విడుతగా 2వేల ఎకరాలను సాగు చే యాలని ఉద్యానవన శాఖ కసరత్తు చేస్తున్నది. ఈ ఏడాది కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసి పైలట్ ప్రాజె క్టు కింద ప్రణాళిక సిద్ధం చేస్తున్నది. ప్రస్తుతం నర్సరీలో 45రోజుల వయస్సు మొక్కలు అందుబాటు లో ఉన్నాయి. ఇప్పటికే నుస్రుల్లాబాద్ మండలం బొప్పాస్పల్లి గ్రామంలో ఆయిల్‌పామ్ సాగు విజయవంతంగా కొనసాగుతుండడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా పంట సాగుకు రైతులు ముందు కు వస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో 8039 ఎకరాల్లో సాగు కోసం 2178 మంది రైతులు పంటలను వేసేందుకు ముందుకు వచ్చి దరఖాస్తులు చేసుకున్నారు.
రైతుబంధుతోపాటు అదనంగా రూ.4వేల ఆర్థిక సహాయం
ఆయిల్‌పామ్ పంటలను సాగు చేసే రైతులకు రైతుబంధుతోపాటు అదనంగా మరో రూ.4వేలు ఆర్థిక సహాయం అందించనున్నది. సర్కార్ ప్రోత్సాహంతో రైతులు ఈ తోటల సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ఒక్కసారి అందుబాటులోకి వస్తే దాదాపు 30 నుంచి 40 ఏండ్ల పాటు ఆదాయం ఇచ్చే పంటగా పేరుండడంతో మక్కువ పెంచుకుంటున్నారు. ఇటీవల ఈ పంటపై శిక్షణ, అవగాహన కల్పించేందుకు రైతులను సమాయత్తం చేశారు. పంట దిగుబడిని స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్ సౌకర్యం కల్పించనున్నది. ప్రస్తుతం టన్ను ధర రూ. 18వేలుగా నిర్ణయించారు. ఒక పంట కాలంలో ఎకరంలో సుమారు 10 టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పంట సాగుకు ముందుగా కొంతమందిని ఎంపిక చేసి ఆయిల్‌పామ్ మొక్కలను అందించనున్నారు. వీటికి సబ్సిడీ ద్వారా డ్రిప్, స్ప్రింక్లర్లు, వంటి వాటిని అందించనున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను పెద్ద మొత్తంలో ఆయిల్‌పామ్ మొక్కలను అందించాలని నిర్ణయించారు.
రాయితీలు ఇలా..
ఆయిల్‌పామ్ సాగు చేసే రైతుకు ఎకరాకు రూ.36వేలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో తొలి ఏడాది రూ.26వేలు, రెండు, మూడు సంవత్సరాల్లో రూ.5వేలు అందించనున్నది. ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్న రైతులకు గుంతలు తవ్వడం, మొక్కలు నాటడం, సస్యరక్షణ చర్యలు చేపట్టనున్నారు. బిందుసేద్యం కోసం ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, బీసీ జనరల్ రైతులకు 5ఎకరాల్లోపు 90శాతం, 5 ఎకరాల పైన ఉంటే 80 శాతం సబ్సిడీపై పరికరాలు అందజేయనున్నా రు. జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకు ముందు డ్రిప్ అందించనున్నారు. ఒకటి నుంచి పన్నెండు ఎకరాల వరకు సబ్సిడీ అందనున్నది.