సూర్యాస్తమయం తర్వాత పోస్టుమార్టం చేసేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ
ఉమ్మడి జిల్లాలో తొమ్మిది దవాఖానల్లో ఏర్పాట్లు
కామారెడ్డి, నవంబర్ 21: ఇక నుంచి ప్రభుత్వ దవాఖానల్లో రాత్రి సమయాల్లో కూడా మృతదేహాలకు పోస్టుమార్టం చేయనున్నారు. రాత్రిపూట తగిన వసతులు, వైద్య సదుపాయాలు ఉన్న దవాఖానల్లో మృతదేహాలకు పోస్టుమార్టం చేయవచ్చని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బ్రిటీష్ పరిపాలన కాలంలో తెచ్చిన విధానానికి స్వస్తి పలుకుతూ ఇప్పటి నుంచి దవాఖానల్లో ఎప్పుడైనా పోస్టుమార్టం చేయవచ్చని తెలుపుతూ ప్రొటోకాల్‌లో వచ్చిన మార్పుల విధానాన్ని వివరించింది. మెడికో లీగల్ కేసులకు చట్టప్రకారం పోస్టుమార్టం చేస్తారు. అయితే అలాంటి మృతదేహాలకు ఇప్పటి వరకు పగలు మాత్రమే పోస్టుమార్టం చేసేందుకు చట్టం అనుమతిస్తున్నది. దీంతో కొన్నిసార్లు పోస్టుమార్టం కోసం గంటల తరబడి దవాఖానల్లోనే మృతదేహాన్ని ఉంచాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో సూర్యాస్తమయం తర్వాత కూడా పోస్టుమార్టం చేసేందుకు వీలు కల్పిస్తున్నారు. అయితే మెడికో లీగల్ కేసులు, ఆత్మహత్యలు, నరహత్య, లైంగికదాడి హత్య తదితర కేసులకు సంబంధించి శాంతిభద్రతల అంశం తలెత్తితే తప్ప రాత్రివేళ పోస్టుమార్టం తప్పనిసరి కాదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెల్లడించాయి. అవయవదానం, అవయవ బదిలీని ప్రోత్సహించేందుకు రాత్రివేళలో పోస్టుమార్టం నిర్ణయం తీసుకున్నారు.
బ్రిటీష్ కాలంనాటి విధానానికి తెర..
బ్రిటీష్ కాలం నాటి నుంచి ఉన్న పోస్టుమార్టం విధానానికి తెరపడింది. ఇకపై 24గంటలపాటు పోస్టుమార్టం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆధునాతన వైద్య సౌకర్యాలున్న జిల్లా కేంద్ర దవాఖానల్లో, ఏరియా దవాఖానలతోపాటు పోస్టుమార్టం వసతులు ఉన్న ప్రభుత్వ దవాఖానల్లో 24 గంటల పాటు పోస్టుమార్టం చేసేందుకు చర్యలు చేపట్టబోతున్నారు. ఈ నెల 15 నుంచి అమల్లోకి వచ్చేలా రాష్ట్ర వైద్య శాఖ, డీఎంఈకి సమాచారం అందించారు. అనుమానాస్పదంగా మరణించిన వారితోపాటు లైంగికదాడిలో హత్యగురైన వారి మృతదేహాలను రాత్రివేళ కాకుండా ఉదయం నుంచి సాయంత్రం లోపు నిర్వహించనున్నారు. ముఖ్యంగా అవయవదానాల విషయంలో మాత్రం రాత్రి సమయంలో కూడా పోస్టుమార్టం చేయనున్నారు.
ఉమ్మడి జిల్లాలో తొమ్మిది చోట్ల..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో 9చోట్ల పోస్టుమార్టం నిర్వహించనున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జీజీహెచ్, బోధన్‌లోని జిల్లా దవాఖాన, ఆర్మూర్ ఏరియా దవాఖాన, బాల్కొండ, మోర్తాడ్ ప్రభుత్వ దవాఖానలతోపాటు కామారెడ్డి జిల్లా పరిధిలోని కామారెడ్డి జిల్లా దవాఖాన, బాన్సువాడ, ఎల్లారెడ్డి ఏరియా దవాఖానలు, మద్నూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సూర్యాస్తమయం తర్వాత పోస్టుమార్టం ఉత్తర్వులు జారీ కాగా, రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది.