నిజామాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పెట్రో ధరలు ఇష్టారాజ్యంగా పెంచడంతో సామాన్య ప్రజలపై పెనుభారం పడుతున్నది. కరోనా వైరస్‌తో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు ఇప్పుడిప్పుడే నిలదొక్కు కుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తరచూ ఇంధన ధరలను పెంచుతూ పోతున్నది. ధరల పెరుగుదల పరోక్షంగా నిత్యావసర సరుకుల ధరలపై ప్రభావం చూపుతున్నది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.111.92, డీజిల్ రూ.104.48కి చేరింది. దీంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. వాహనాలను బయటికి తీయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు గ్యాస్ సిలిండర్ల ధరలు సైతం ఏడాదిలోనే సుమారు రూ.300 పెరిగింది. గతేడాది నవంబర్‌లో రూ.670 ఉన్న సిలిండర్ ధర రూ.975.50కి చేరింది. దీంతో గ్యాస్ బండ సామాన్యుడికి గుదిబండగా మారుతున్నది. పేద, మధ్య తరగతి వర్గాలైతే పెరుగుతున్న ఎల్పీజీ గ్యాస్ ధరలతో వినియోగంపై పునరాలోచనలో పడ్డారు. నెల రోజుల్లోనే పలుమార్లు ధరల పెంపుతో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. కేంద్రం తీరుపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
సమయం, సందర్భం లేకుండా ఇష్టానుసారంగా ఇంధన ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు చతికిల పడుతున్నారు. దేశ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా నియంత్రణ లేని పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరల పెరుగుదలతో అన్ని వర్గాల ప్రజలు ప్రభావానికి గురవుతున్నారు. ఇప్పటికే కరోనా వైరస్‌తో అతలాకుతలమైన సామాన్యు లు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో మరింత కుదేలవుతున్నారు. ఇంధన ధరల పెంపు మూలంగా పరోక్షంగా నిత్యావసరాల ధరల పెరుగుదలకు ఊతం ఇస్తుండడంతో ఆందోళన వ్యక్తం అవుతున్నది. విరామం లేకుండా పెట్రో ధరల మంట కొనసాగుతుండడంతో వాహనాదారులు భయాందోళనకు గురవుతున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు వ్యవహరిస్తున్న అమానవీయమైన తీరుపై మండిపడుతున్నారు. సెప్టెంబర్ నెలాఖరు నుంచి మరోమారు పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సిలిండర్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి.
వరుసగా ఐదో రోజు చమురు ధరలు భారీగా ఎగబాకడంతో సామాన్యులపై కేంద్ర ప్రభుత్వం ఎనలేని భారం మోపుతున్నది. రికార్డు స్థాయిలో డీజిల్ లీటర్‌కు రూ.104.48 చేరుకోవడంతో కర్షక లోకానికి ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయి. గ్యాస్ సిలిండర్ రూ.975.50 చేరడంతో గృహిణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ ధర రూ.112 కి చేరువవ్వడంతో ప్రజలంతా కేంద్రం తీరుపై ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు.
వంట గదిలో ధరల మంట..
వంట గ్యాస్ నిత్య జీవితం లో ఒక భాగంగా మారింది. ఒక్క రోజు లేకున్నా గడవడం కష్టమే. ప్రస్తుతం వినియోగించేందుకు సామాన్యులు ఆలోచించాల్సిన దుస్థితి ఏర్పడింది. పెరుగుతున్న సిలిండర్ ధరలు అందుకు దోహదం చేస్తున్నాయి. పేద, మధ్య తరగతి వర్గాలైతే పెరుగుతున్న ఎల్పీజీ గ్యాస్ ధరలతో వినియోగంపై పునరాలోచనలో పడ్డారు. గ్యాస్‌బండ సామాన్యుడికి గుదిబండగా మారుతున్నది. నెల రోజుల్లోనే పలుమార్లు ధరల పెంపుతో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర పెంపుతో వినియోగదారులపై ప్రతి నెలా అదనంగా రూ.కోట్లలో భారం పడుతున్నది. ఎల్పీజీ సిలిండర్ ధరలను ఇష్టానుసారంగా కేంద్ర ప్రభుత్వం పెంచేస్తోంది. ప్రతి నెలా రూ.25 నుంచి రూ.100 వరకు పెంచుతూ పేద, మధ్య తరగతి వర్గాల నడ్డి విరుస్తోంది. 2020 నవంబర్‌లో రూ.670 ఉన్న సిలిండర్ ధర డిసెంబర్లో రూ.100 పెరిగింది. రూ.770తో ధరల పెరుగుదల ఏడాది కాలంగా పరుగులు తీస్తూనే ఉంది. 2021 ఫిబ్రవరిలో రూ.75, మార్చిలో రూ.50 పెంచారు. ఏప్రిల్‌లో కంటితుడుపు చర్యగా రూ.10 తగ్గించారు. తిరిగి జులైలో రూ.25.50, ఆగస్టులో రూ.25, సెప్టెంబర్‌లో రూ.25 పెంచగా అక్టోబర్‌లో మరింతగా ధరలను పెంచి రూ.975.50కు చేర్చారు.
సెంచరీ దాటి డీజిల్ రేటు
పెట్రోల్, డీజిల్ ధరలను గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం రికార్డు స్థాయికి తీసుకెళ్లింది. సెంచరీ దాటించి మరింత పరుగులు తీయిస్తుండడంతో సామాన్యుల గుండెలు దడదడమంటున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో కింది స్థాయిలో పేద కుటుంబాలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. 2021, సెప్టెంబర్ 28 వరకు రూ.99.67 ఉన్న డీజిల్ ధర అక్టోబర్ 1వ తారీఖు నాటికి రికార్డు స్థాయిలో సెంచరీ దాటి రూ.100.32కు చేరింది. వరుసగా వారం రోజులుగా పైసా చొప్పున పెంచుతూ ప్రస్తుతం లీటర్ డీజిల్‌ను రూ.104.48కు చేర్చారు. అక్టోబర్ 3నాడు రూ.1.10, అక్టోబర్ 5న 68 పైసలు, అక్టోబర్ 6న 52 పైసలు, అక్టోబర్ 7న 8 పైసలు అక్టోబర్ 8న 97 పైసల్ చొప్పున ఎగబాకింది. గడిచిన 10 రోజుల కాలంలోనే డీజిల్ ధర రూ.4 వరకు ఎడాపెడా పెంచేశారు. ఇక పెట్రోల్ ధరల పెరుగుదల రాకెట్ వేగంతో దూసుకుపోతున్నది. సామాన్య ప్రజలు వాహనం నడపాలంటేనే భయపడే పరిస్థితికి బీజీపే సర్కారు తీసుకు వచ్చింది. ఇప్పటికే ఆల్ టైం రికార్డుకు చేరిన పెట్రోల్ ధరలతో అల్లాడిపోతున్న జనంపై మోదీ ప్రభుత్వం మరింత భారం మోపడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. సెప్టెంబర్ 28, 2021నాడు రూ.107.56 పలికిన లీటర్ పెట్రోల్ ధర ఇప్పుడు ఏకంగా రూ.111.92 కు చేరింది. పది రోజుల్లోనే రూపాయిన్నర పెరగడం విశేషం
ధరలు పెంచడం దారుణం
నిజామాబాద్ సిటీ, అక్టోబర్ 18 : ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం చాలా దారుణం. రోజురోజుకూ ధరలు పెంచడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. పేదల గురించి ఆలోచించాల్సిన కేంద్రం ధరలు పెంచడం బాధగా ఉంది. ధరలు చూసి వాహనాలను బయటికి తీయాలంటే భయపడుతున్నాం.
-సంపత్, వినాయక్‌నగర్