మొత్తం రూ. 250 కోట్లు విడుదల
నిజాంసాగర్ మండలానికి రూ. 50 కోట్లు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హర్షం వ్యక్తం చేస్తున్న దళితులు
నిజాంసాగర్, అక్టోబర్18: దళితుల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకానికి రూ.250 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు సోమవారం జారీ చేసింది. ఇందులో భాగంగా మొదటి విడుతలో కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలానికి రూ.50 కోట్లు మంజూరయ్యాయి. నిధులు విడుదల చేయడంతో మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన దళితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దళితుల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న దళితబంధు పథకానికి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 250 కోట్ల నిధులను సోమవారం విడుదల చేసింది. అందులో జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలానికి మొదటి విడుతగా రూ.50 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిధుల విడుదలకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలానికి రూ.100 కోట్లు, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిర్మలగిరి మండలానికి రూ.50 కోట్లు, నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట కల్వకుర్తి నియోజకవర్గంలోని చారగొండ మండలానికి రూ.50 నిధులను విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. నిజాంసాగర్ మండలానికి మొదటి విడుతగా రూ.50 కోట్లను విడుదల చేయడంతో మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన దళితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.