జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి విక్రమ్
ముగిసిన పాన్ ఇండియా కార్యక్రమాలు
నిజామాబాద్ లీగల్, నవంబర్ 14: గ్రామాల్లో ప్రజలకు చట్టాల ప్రాముఖ్యతను వివరించడానికి పాన్ ఇండియా న్యాయ అవగాహన, విస్తరణ కార్యక్రమం ఒక నూతన ఉత్తేజాన్ని కలిగించిందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జగన్నాథం విక్రమ్ అన్నారు. పాన్ ఇండియా కార్యక్రమంలో భాగం గా చివరి రోజైన ఆదివారం జిల్లా కోర్టు నుంచి ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. న్యాయ సేవా సంస్థకు, ప్రజలకు మధ్య సంబంధాల ఏర్పాటుకు అంకురార్పణ జరిగిందని, దీంతో న్యాయ సేవలు ఎక్కువ మందికి అందించడానికి అవకాశం ఏర్పడిందని తెలిపారు. 44 రోజుల న్యాయ ప్రస్థానంలో తెలియని విషయాలు తెలుసుకోవడం, న్యాయస్థానాలు తమ కోసమే ఉన్నాయనే విషయాన్ని ప్రజలు అవగతం చేసుకున్నారని వివరించారు. న్యాయ సేవా సంస్థ, ప్యానల్ న్యాయవాదులు, పారాలీగల్ వలంటీర్లు, అంగన్వాడీ, ఆశ వర్కర్లు, ఆదరించిన ఉమ్మడి జిల్లా ప్రజలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి జిల్లా పరిపాలన యంత్రాంగం, పోలీసుశాఖ సహకారం మరువలేనిదని, భవిష్యత్తు కార్యక్రమాల నిర్వహణకు పాన్ ఇండియా ఒక మార్గాన్ని సూచించిందని జడ్జి విక్రమ్ తెలిపారు. ర్యాలీలో సంస్థ ప్యానల్ న్యాయవాదులు రాజ్‌కుమార్ సుబేదార్, దాసరి పుష్యమిత్ర, ఆశా నారాయణ, వెంకటేశ్వర్, మాణిక్‌రాజ్, సంస్థ పర్యవేక్షకులు పురుషోత్తంగౌడ్, చంద్రసేనారెడ్డి, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.
ప్ల కార్డులతో కొనసాగిన ర్యాలీ..
జిల్లా న్యాయ సేవా సంస్థ రూపొందించిన ప్ల కార్డులు పట్టుకుని జిల్లా కోర్టు నుంచి పూలాంగ్ చౌరస్తా వరకు తిరిగి జిల్లా కోర్టు వరకు ర్యాలీ కొనసాగింది. వివిధ చట్టాలను తెలుపుతూ ప్ల కార్డులను ప్రదర్శించి, కరపత్రాలను పంచిపెట్టారు.