ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ బెడ్ల ఏర్పాటు
పలు మండలాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి వేముల
బాల్కొండ (ముప్కాల్ )/ మెండోరా, డిసెంబర్ 13 : గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ దవాఖానల ద్వారా కార్పొరేట్ తరహాలో వైద్య సేవలు అందిస్తున్నట్లు రాష్ట్ర రోడ్డు, భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. బాల్కొండ, మెండోరా, వేల్పూ ర్ మండలాల్లో సోమవారం ఆయన పర్యటించారు. ఇందులోభాగంగా బాల్కొండ, కిసాన్‌నగర్, మెండోరా మండల కేంద్రాల్లోని పీహెచ్‌సీల్లో తనతోపాటు తన మిత్రుల సహకారంతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ బెడ్స్, వాటర్ ప్యూరిఫైయర్, ఆధునీకరణ పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. కరోనా సెకండ్ వేవ్‌లో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగిందన్నారు. తన సన్నిహితులు, ఆత్మీయులను పోగొట్టుకున్నట్లు చెప్పారు. ఆక్సిజన్ , ఐసీయూ బెడ్లు దొరక్క చాలా మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. అలాంటి పరిస్థితులు ఎదురుకావొద్దనే ఉద్దేశంతో తన మిత్రులతో కలిసి ఆక్సిజన్ ప్లాంటు, దవాఖానల ఆధునీకరణ చేపట్టినట్లు చెప్పారు. ఇందులో భాగంగా బాల్కొండ, కిసాన్‌నగర్, మెండోరా పీహెచ్‌సీల్లో ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేశామన్నారు. బాల్కొండ మండలంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఎంపీపీ లావణ్యా లింగాగౌడ్, జడ్పీటీసీ దాసరి లావణ్య, వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్‌రెడ్డి, సర్పంచ్ బూస సునీత, ఎంపీటీసీ సభ్యుడు కన్న పోశెట్టి, ఆర్డీవో శ్రీనివాసులు, డీఎంహెచ్‌వో సుదర్శన్, డిప్యూటీ డీఎంహెచ్‌వో రమేశ్‌బాబు, జిల్లా కేంద్ర దవాఖాన సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, జిల్లా మత్స్యశాఖ అధికారి ఆంజనేయ స్వామి పాల్గొన్నారు.
ప్రారంభోత్సవాలు..శంకుస్థాపనలు
బాల్కొండ మండల కేంద్రంలో రూ.10 లక్షలతో నిర్మించిన ఫిష్ మార్కెట్‌ను మంత్రి ప్రారంభించారు. అత్తరుగల్లీలోని ప్రైమరీ స్కూల్లో రూ.7.50 లక్షలతో చేపట్టనున్న అదనపు తరగతుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కిసాన్‌నగర్‌లో రూ. 5 లక్షలతో చేపట్టనున్న ఎస్సీ సంఘ భవనం, కిసాన్నగర్తోపాటు ఇత్వార్‌పేట్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలల్లో రూ.7.50 లక్షలతో చేపట్టనున్న అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ముప్కాల్ మండలంలోని వెంచిర్యాల్ నుంచి వెల్కటూర్ గ్రామం వరకు రూ. కోటీ 40 లక్షలతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. మెండోరా మండలంలోని పోచంపాడ్ రామాలయంలో రూ.24 లక్షలతో చేపట్టనున్న ఉత్తరముఖ ద్వారం, వెల్కటూర్ గ్రామశివారులో ఉన్న గుండెవాగుపై రూ.2.60 కోట్లతో చేపట్టనున్న వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.