నిజామాబాద్, డిసెంబర్ 13(నమస్తే తెలంగాణ ప్రతినిధి);మాతా శిశు సంరక్షణలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న అంగన్వాడీలపై కేంద్రం చిన్నచూపు చూస్తుండగా, రాష్ట్ర సర్కారు అండగా నిలుస్తున్నది. గర్భిణులు, బాలింతలు, ఆరేండ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం అందేలా కృషిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు రాష్ట్ర ప్రభుత్వం భరోసాగా ఉంటున్నది. ఏడేండ్లలో మూడుసార్లు వేతనాలు పెంచి.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తున్నది. అంగన్వాడీల వేతనాల్లో కేంద్రం వాటా 90శాతం ఉండగా.. 60శాతానికి కుదించుకుంది. 10శాతం వాటా ఇవ్వాల్సిన రాష్ట్రం.. 40శాతం ఇస్తూ వేలాది మందికి లబ్ధి చేకూరుస్తున్నది. ప్రస్తుతం అంగన్వాడీ టీచర్ల వేతనాన్ని రూ.10,500 నుంచి రూ.13,650కు, మినీ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల వేతనాన్ని రూ.6వేల నుంచి రూ.7,800కు పెంచగా, పెరిగిన వేతనం వచ్చే నెల నుంచే వారి బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 30శాతం వేతనాలు పెంచడంతో అంగన్వాడీ నిర్వాహకులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
మాతా శిశు సంరక్షణలో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అంగన్వాడీ సెంటర్లు కొనసాగుతున్నాయి. గర్భిణులు, బాలింతలు, ఆరేండ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు ఇవి దోహదపడుతున్నాయి. శిశు సంక్షేమంతోపాటు మహిళల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ కంటికి రెప్పలా చూడడంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు చేసే కృషి అద్భుతం. చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తూ వారికి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని ఇవ్వడంలోనూ వీరే కీలకం. పేద కుటుంబాల్లో పొట్ట గడవడమే గగనమైన పరిస్థితిలో ఆరోగ్యవంతమైన ఆహారం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు, గర్భిణి, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్నది. సర్కారు లక్ష్యాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వీరి పనికి తగిన వేతనం అందక నిత్యం రోడ్డెక్కి ధర్నాలు చేసేవారు. వేతన వెతలతో కాలం వెళ్లదీస్తున్న అంగన్వాడీ నిర్వాహకులకు తెలంగాణ సర్కారు అండగా నిలుస్తున్నది. ఏడేండ్ల స్వరాష్ట్ర పరిపాలనలో మూడుసార్లు వేతనాల పెంపుదలతోపాటు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఉద్యోగ భద్రతను కల్పించడం విశేషం.
ఇవీ గణాంకాలు..
నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ ప్రాజెక్టు పరిధిలో 326 సెంటర్లలో 317 మంది టీచర్లు పనిచేస్తున్నారు. భీమ్‌గల్‌లో 282 సెంటర్లలో 279 మంది, బోధన్‌లో 331 సెంటర్లలో 323మంది, డిచ్‌పల్లిలో 303 కేంద్రాల్లో 297 మంది, నిజామాబాద్ అర్బన్ ప్రాజెక్టు పరిధిలో 258 సెంటర్లలో 253 మంది పనిచేస్తున్నారు. జిల్లాలో మొత్తం 1500 సెంటర్లుండగా 1469 మంది పనిచేస్తున్నారు. సీఎం కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత 9నెలలకు అంగన్వాడీ టీచర్లకు రూ.4,200 నుంచి రూ.7వేలకు వేతనం పెంచారు. మినీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు రూ.2,200 నుంచి రూ.4,500కు వేతనాలు పెరిగాయి. 2017 ఫిబ్రవరి 27న అంగన్వాడీ టీచర్లు, ఆయాలను సీఎం కేసీఆర్ స్వయంగా ప్రగతిభవన్‌కు పిలిపించి, కలిసి భోజనం చేసి రెండోసారి వేతనాలు పెంచారు. అంగన్వాడీ టీచర్లకు రూ.7వేల నుంచి రూ.10,500కు, ఆయాలకు రూ.4,500 నుంచి రూ.6వేలు చేశారు. ఉద్యోగులకు ఇటీవల 30శాతం ఫిట్మెంట్ ప్రకటించారు. ఈ సందర్భంలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, అంగన్వాడీ, ఆశ, హోంగార్డు తదితరులందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఫిట్మెంట్ వర్తింపజేస్తామని సర్కారు ప్రకటించింది.జనవరి నుంచి చెల్లించే వేతనాలతో పెరిగిన మొత్తం అంగన్వాడీ సిబ్బంది బ్యాంక్ అకౌంట్లలో జమ కానున్నాయి. ఏడేండ్లలో దేశంలో ఎక్కడా లేని విధంగా అంగన్వాడీ టీచర్లకు మూడు రెట్ల కన్నా అధికంగా (325 శాతం), మినీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు మూడున్నర రెట్లు (354శాతం) వేతనాలు పెరగడం విశేషం.
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ…
రాష్ట్రంలోని అంగన్వాడీలు, మినీ అంగన్వాడీలు, హెల్పర్లకు పెంచిన వేతనాలను డిసెంబర్ నెల నుంచే వారి బ్యాంక్ అకౌంట్లో జమ కానున్నాయి. అంగన్వాడీ టీచర్ల వేతనాన్ని రూ.10,500 నుంచి రూ.13,650కు, మినీ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల వేతనాన్ని రూ.6వేల నుంచి రూ.7,800కు ఈమధ్య కాలంలోనే ప్రభుత్వం పెంచింది. సీఎం కేసీఆర్ తీసుకున్న వేతన పెంపు నిర్ణయంతో అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న వేలాది మందికి లబ్ధి చేకూరుతున్నది. అంగన్వాడీ విషయంలో కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పుకుంటుండగా… టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడేండ్లలో మూడుసార్లు వేతనాలను పెంచింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంగన్వాడీల వేతనాల్లో కేంద్రం వాటా 90శాతం నుంచి 60శాతానికి తగ్గించింది. రాష్ట్రం వాటా పది నుంచి 40 శాతానికి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పెంచిన వేతనాలను పరిగణనలోకి తీసుకుంటే, అంగన్వాడీ టీచర్ల వేతనాల్లో కేంద్రం వాటా 19శాతం, హెల్పర్ల వేతనాల్లో 17శాతం మాత్రమే ఉంది. 40శాతం చెల్లించాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే 80శాతానికి పైగా భారాన్ని మోస్తున్నది. అంగన్వాడీల్లో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాల పెంపుతో సీఎం కేసీఆర్ మానవీయకోణంలో లబ్ధి చేకూరుస్తున్నారు.
తప్పించుకుంటున్న కేంద్ర ప్రభుత్వం
అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం క్రమంగా తప్పుకుంటున్నది. అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే టీచర్లు, హెల్పర్లకు ఇవ్వాల్సిన వేతనాల విషయంలోనూ చేతులెత్తేసింది. బొటాబొటిన వేతనాలను అందిస్తూ దులుపేసుకుని… మిగిలిన భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపైకి నెట్టి వేస్తున్నది. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి అంగన్వాడీల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఏడేండ్లలో మూడుసార్లు వేతనాలు పెంచారు. భారీగా పెరిగిన వేతనాలతో కేంద్రాల నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వేతనాల పెంపు నిర్ణయం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో దాదాపుగా 5వేల మంది అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు లబ్ధి చేకూర్చింది. ఇప్పుడు వారి కుటుంబాల్లో సంబురం కనిపిస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 30శాతం వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడంతో అంగన్వాడీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు వేతనాలు పెంచినందుకు సీఎం కేసీఆర్‌కు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కృతజ్ఞతలు చెబుతున్నారు.