వరికొయ్యలకు నిప్పు పెడితే అనర్థాలు
భూసారం దెబ్బతినే అవకాశం
కలియదున్నితేనే మేలు
ఆర్మూర్, డిసెంబర్ 13 ;అప్పటి రోజుల్లో రైతులు వరిని మొదళ్ల వరకు కోసేవారు. పశువులు ఎక్కువగా, వరిసాగు తక్కువగా ఉండడంతో గడ్డివాములు ఏర్పాటు చేసుకునేవారు. ప్రస్తుతం సాగు విధానాల్లో మార్పులు, యంత్రాల వినియోగంతో పశువుల సంఖ్య తగ్గిపోయింది. హార్వెస్టర్‌తో వరి కోయడంతో కొయ్యలు పెద్దగా మిగిలిపోతున్నాయి. కొందరు రైతులు అవసరమైన మేరకు గడ్డిని తెచ్చుకుంటున్నా, పెద్ద సంఖ్యలో మాత్రం అక్కడే వదిలివేస్తున్నారు. దీంతో దున్నేటప్పుడు నాగళ్లకు అడ్డుగా వస్తున్నాయని, కలుపు మొక్కలు పెరుగుతాయనే అపోహతో కాలబెడుతున్నారు. అలా చేస్తే నష్టాలే తప్ప లాభం ఏమాత్రమూ ఉండదని శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
వరికొయ్యలను కాలిస్తే పర్యావరణ కాలుష్యం ఏర్పడడంతోపాటు పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు నశిస్తున్నాయి. సారవంతమైన భూమి దెబ్బ తింటున్నది. రైతులు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే వరికొయ్యల మిగులు అవశేషాలతో సిరులు సంపాదించవచ్చని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. వరి కోత అనంతరం ఉండే గడ్డిని పశువులకు వాడడం లేదా కంపోస్ట్‌గా మార్చుకోవాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
కొయ్యలను కాల్చితే అనర్థాలు..
పొలంలో కొయ్యలను కాల్చడం అత్యంతప్రమాదకర స్థాయికి చేరుకున్నదని శాస్త్రవేత్తలు, సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు అవగాహన లేమితో పంటకు ఎంతో మేలు చేసే కొయ్యలను భూమిలో కలియదున్నకుండా కాల్చివేసి భవిష్యత్ పంటను నాశనం చేస్తున్నారని, వాతావరణాన్ని తీవ్రంగా కలుషితం చేస్తున్నారని చెబుతున్నారు. కొయ్యలను కాల్చివేసే క్రమంలో భూమి గట్టిపడుతుందని, పొలాన్ని కలియదున్నడం వీలుకాదని పేర్కొంటున్నారు. కొయ్యలను కాల్చివేయడంతో భూమిలో ఉన్న సూక్ష్మక్రీములు, వానపాములు నాశనమవుతాయని, దీంతో భూమి గుల్లగా మారే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. నాట్లు వేసిన వేర్లకు సరిగా పోషకాలు చేరవని, ఫలితంగా పైరు పెరగదని వివరిస్తున్నారు. రైతులు ఎక్కువగా యూరియాను వినియోగించాల్సి వస్తుందని,కానీ దాన్ని స్వీకరించి వేర్లకు అందించే సూక్ష్మజీవులు అప్పటికే అంతరించడంపోవడంతో ప్రయోజనం లేకుండా పోతుందని పేర్కొంటున్నారు. ఇదే సమయంలో యూరియాను అతిగా వాడడంతో భూమిలోకి చేరి భూగర్భజలం విషతుల్యమవుతుందని, వాతావరణంలో అనేక మార్పులు కలుగుతాయని చెబుతున్నారు. కార్బన్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్ గాలిలో కలిసి వాతావరణం, జీవకోటిపైన తీవ్రప్రభావం చూపుతాయి. వీటి మూలంగా జీవ, మానవ శరీరంలోకి కొవ్వు పదార్థాలు చేరి అనారోగ్యం పాలవుతారు. పురుషుల్లో శుక్రకణాలు దెబ్బతింటాయని, గర్భస్థ శిశువుల ఎదుగుదల తగ్గుతుందని, మహిళల్లో హార్మోన్లలో అసమానతలు వస్తాయని, క్యాన్సర్, ఆస్తమా వంటి ప్రమాదకరమైన రోగాలు సంక్రమిస్తాయని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.
కలియదున్నితేనే లాభం..
పంట కోసిన వెంటనే వరికొయ్యలను కాల్చకుండా పొలంలోనే కలియదున్నాలని వ్యవసాయాధికారులు రైతులకు సూచిస్తున్నారు. వరి కొయ్యలను పొలంలో కలియదున్నడంతో కొయ్యలు మట్టితో కప్పబడి కుళ్లే ప్రక్రియ ప్రారంభమవుతుంది. తర్వాత సేంద్రియ ఎరువు గా మారుతుంది. వరికొయ్యలను కలియదున్నడం, కుప్ప చేయడం తో నేలలో పగుళ్లు రాకపోవడం, తేమ ఆవిరి కావడం తగ్గి భూమి కో తకు గురికాకుండా ఉంటుంది. కొయ్యలను కలియదున్ని వెంటనే కు ళ్లిపోయేలా పొటాషియం చల్లితే సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. తదుపరి పంటకు పోషకాలు విపరీతంగా పెరుగుతాయి.