ప్రభుత్వ పాఠశాలలకు ఎమ్మెల్సీ కవిత నిధుల మంజూరు
మౌలిక సౌకర్యాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి
ఉమ్మడి జిల్లాలోని పలు స్కూళ్లలో సోలార్ ప్లాంట్ల నిర్మాణానికి చర్యలు
ఒక్కో పాఠశాలకు రూ. 1.60 లక్షల నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్సీ
ఆర్మూర్/ కమ్మర్పల్లి/ బాన్సువాడ, డిసెంబర్ 13: ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక దృష్టి సారించారు. పాఠశాలల్లో సౌకర్యాల కల్పన కోసం కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్‌ప్లాంట్ల ఏర్పాటు కోసం నిధులు మంజూరు చేశారు. ఒక్కో పాఠశాలకు రూ. లక్షా 60 వేల చొప్పున నిధులు మంజూరు చేశారు. దీంతో స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ కవితకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్, ఆర్మూర్ మండలంలోని ఆలూర్, మంథని, నందిపేట్ మండలంలోని నికాల్పూర్, మాక్లూర్ మండలంలోని గొట్టుముక్కుల, గుత్ప గ్రామాల్లోని జడ్పీ ఉన్నత పాఠశాలలకు నిధులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఆర్మూర్ పట్టణ, మండల అధ్యక్షులు పూజా నరేందర్, ఆలూర్ శ్రీనివాస్‌రెడ్డి , ప్రజాప్రతినిధులు, నాయకులు ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.
కమ్మర్పల్లి మండంలోని బషీరాబాద్ జడ్పీ హైస్కూల్లో సోలార్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఎమ్మెల్సీ కవిత సీడీపీ నిధుల నుంచి రూ.లక్షా 60 వేలు మంజూరు చేసినట్లు సర్పంచ్ సక్కారం అశోక్ తెలిపారు. పాఠశాలలో కంప్యూటర్లు, ఇతర అవసరాలకు విద్యుత్ సమస్య పరిష్కారానికి ఈ నిధులు వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్సీ కవిత, ఇందుకు సహకరించిన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన చెప్పారు.
బాన్సువాడ మండలంలోని బోర్లం, తిర్మలాపూర్ జడ్పీ పాఠశాలలతోపాటు బాన్సువాడ బాలుర జడ్పీ పాఠశాలకు నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్సీ కవితకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు బోర్లం ఎంపీటీసీ పెద్దపట్లోళ్ల శ్రావణి పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆమె.. పాఠశాలలో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించడం హర్షణీయమని తెలిపారు.