8.5 తులాల బంగారు నగలు స్వాధీనం
మరొకరి కోసం గాలింపు
వివరాలను వెల్లడించిన నగర సీఐ సత్యనారాయణ
నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 13 : మహారాష్ట్రతో పాటు మన రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు నగర సీఐ సత్యనారాయణ తెలిపారు. నాల్గో టౌన్లో సో మవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై సందీప్‌తో కలిసి ఆయన వివరాలను వెల్లడించారు. మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన దశరథ్, ర్యాపంవాడ శంకర్, మాసు వెంకట్ గైక్వాడ్ అనే ముగ్గురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి మన రాష్ట్రం తో పాటు మహారాష్ట్ర ప్రాంతంలోని పలు జిల్లాల్లో తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసుకొని చోరీలు చేశారు. నిజామాబాద్, మెదక్, నారాయణ్ ఖేడ్, భోకర్, నాగర్‌కర్నూల్, నిర్మల్ జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఈ ముఠా నిజామాబాద్ నగరంలోని ఆర్యనగర్ బ్యాంక్ కాలనీ, బోర్గాం(పీ) పరిధిలోని రెండు ఇండ్లతో పాటు బోధన్ పట్టణంలోని ఓ ఇంటిలో దొంగతనానికి పాల్పడ్డారు. ఈ గ్యాంగ్ ఆదివారం రాత్రి నిజామాబాద్ నగరంలోని పద్మనగర్ ఏరియాలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పెట్రోలింగ్‌లో ఉన్న నాల్గో టౌన్ పోలీసులు దశరథ్, శంకర్‌ను అదుపులోకి తీసుకొని విచారించా రు. నిజామాబాద్, బోధన్ ప్రాంతాల్లో దొంగతనాలు చేసినట్లు వీరు అంగీకరించారు. వీరి నుంచి 8.5 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకొని ఇద్దరిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. మరో నిందితుడు వెంకట్ గైక్వాడ్ పరారీలో ఉన్నాడని, అతడిని త్వరలోనే పట్టుకుంటా మని ఎస్సై తెలిపారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను పట్టుకునేందుకు కృషి చేసిన 4వ టౌన్ ఎస్సై సందీప్, హెడ్ కానిస్టేబుల్ రాములు, కానిస్టేబుళ్లు సుభాష్, వెంకట్రాంలను పోలీస్ కమిషనర్ అభినందించారు.