నిజామాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ గెలుపు లాంఛనంగా మారింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోటీదారు గెలవడానికి కావాల్సిన ఓట్లను మించి టీఆర్ఎస్కు భారీగా సంఖ్యాబలం ఉండడం గమనార్హం. గతేడాది అక్టోబర్లో జరిగిన ఉప ఎన్నికల్లోనే ఈ విషయం ప్రస్ఫుటమైంది. పరువు కోసం పాకులాడిన కాంగ్రెస్, బీజేపీ కనీసం డిపాజిట్ దక్కించుకోలేకపోయాయి. సొంత పార్టీ ప్రజా ప్రతినిధులను కాపాడుకోలేక చతికిలపడ్డాయి. ఆ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు రాష్ట్రప్రభుత్వ పనితీరును మెచ్చి టీఆర్ఎస్కు మద్దతు తెలుపడంతో ప్రతిపక్ష పార్టీలు ఘోర పరాభవాన్ని చవిచూశాయి. ఎలక్షన్ కమిషన్ సిద్ధం చేసిన ముసాయిదా జాబితా ప్రకారం ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 824 మంది ఓటర్లు ఉన్నారు. సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్లో ఓటరు ముసాయిదా జాబితాను ప్రకటించనుండగా.. కొత్తగా ఓటుహక్కు పొందాలనుకునే వారు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 23 వరకు ఈసీ అవకాశం కల్పించింది.
రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముహూర్తం ఖరారు కావడంతో సందడి మొదలైంది. రాజకీయ పార్టీల హడావుడి మొదలవ్వడంతో ప్రజల్లోనూ చర్చ జరుగుతోంది. మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ కొల్లగొట్టడం ఖాయంగానే కనిపిస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ గెలుపు లాంఛనమే. ఈ ఎన్నికల్లో పోటీదారు గెలవడానికి కావాల్సిన ఓట్ల కన్నా భారీ సంఖ్యలో బలం ఉండడంతో టీఆర్ఎస్ విజయ ఢంకా మోగించనుంది. 2020, అక్టోబర్లో జరిగిన ఉప ఎన్నికల్లోనే ఈ అంశం ప్రస్పుటంగా స్పష్టమైంది. పరువు కోసం పాకులాడిన జాతీయ పార్టీలు కనీసం డిపాజిట్ దక్కించుకోక కకావికలమయ్యాయి. అంతేగాకుండా ఉన్న బలాన్ని భారీగా తగ్గించుకున్నాయి. సొంత పార్టీ స్థానిక ప్రజా ప్రతినిధులను కాపాడుకోలేక కుదేలయ్యాయి. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్లు రాష్ట్ర ప్రభుత్వ పనితీరును మెచ్చి క్రాస్ ఓటింగ్ చేశారు. టీఆర్ఎస్కు మద్దతు తెలుపడంతో ప్రతిపక్ష పార్టీలు ఘోరమైన పరాభవాన్ని మూట కట్టుకున్నాయి.
ప్రతిపక్షాల తర్జనభర్జన…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు తొలిసారిగా 2015లో జరిగాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భూపతి రెడ్డి ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అనంతరం పలు రాజకీయ సమీకరణల మూలంగా భూపతి రెడ్డి పార్టీ మారడంతో అనర్హత వేటు పడడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. 2019లో నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి గెలిచిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అత్యుత్సాహంతో బలం లేకున్నా పోరు లో నిలిపాడు. పోతన్కర్ లక్ష్మీనారాయణను పోటీకి దించడంతో కాంగ్రెస్ పార్టీ సైతం సుభాష్ రెడ్డిని రంగంలోకి దించింది. టీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత నిలవడంతో సంఖ్యాబలం ఉన్న గులాబీ పార్టీ సునాయాసంగా విజయం సాధించింది. ఓటర్ల బలం లేకున్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దిగిన కాంగ్రెస్, బీజేపీ చిత్తుగా ఓడిపోయాయి. కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేక చతికిల పడ్డాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీల పదవీ కాలం జనవరి 4వ తేదీతో ముగియనుండడంతో తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో ప్రతిపక్షాలు పోటీలో నిలబడాలా? తప్పుకోవాలా? అనే కోణంలో తర్జనభర్జన పడుతున్నాయి. పోటీకి దూరంగా ఉండి ఉన్న పరువును కాపాడుకుంటే మంచిదనే భావనలో జాతీయ పార్టీలు ఉన్నట్లు తెలుస్తోంది.
బలాబలాలు తేటతెల్లం…
రాజకీయ వ్యూహాల పేరుతో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓటమి తప్పదని తెలిసినా కాంగ్రెస్, బీజేపీలు మరోమారు పోటీకి దిగినా… టీఆర్ఎస్కు జరిగే నష్టమేమీ లేదు. పైగా గత ఉప ఎన్నికల అనుభవం దృష్ట్యా ఇరు పార్టీలకు ఇప్పటికే తగ్గిపోయిన స్థానిక ప్రజాప్రతినిధుల బలం మరింతగా పడిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. గ్రామాల్లో సత్తువ కోల్పోయి డీలా పడిపోయిన కాంగ్రెస్, బీజేపీ ఉన్న వారిని కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నాయి. ఈ పరిస్థితిలో తమకు ఉన్నటువంటి కొద్ది మంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలను ఎలాగైనా చేజారకుండా చూసుకునేందుకు ముప్పుతిప్పలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. భౌగోళికంగా ఈ ఎన్నికలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ సిద్ధం చేసిన ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకారం ప్రస్తుతం 824 మంది మొత్తం ఓటర్లున్నారు. ఇందులో ఏడాది క్రితం ఉప ఎన్నికల్లో 821 మంది ఓటు హక్కు వినియోగించుకోగా టీఆర్ఎస్కు అత్యధికంగా 728 మంది ఓటర్ల మద్దతు దక్కింది. బీజేపీకి కేవలం 56 ఓట్లు, కాంగ్రెస్కు 29 ఓట్లు మాత్రమే పోలవడంతో ఇప్పుడు ఆయా పార్టీల బలాబలాలను తేటతెల్లం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నిక అనివార్యమైతే కాంగ్రెస్, బీజేపీలకు ప్రస్తుతం ఉన్న 85 ఓట్లు కూడా వారికి తిరిగి దక్కే వీలుండదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.