వైభవంగా లక్ష్మీనారసింహుడి బ్రహ్మోత్సవాలు
వేలాదిగా తరలివచ్చిన భక్తులు
వేదమంత్రాలతో పులకించిన లింబాద్రిగుట్ట
భీమ్‌గల్, నవంబర్ 13: వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా లింబాద్రి లక్ష్మీనారసింహుని కల్యాణం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. గతేడాది కరోనా కారణంగా బ్రహ్మోత్సవాలు సాదాసీదాగా నిర్వహించారు. ఈ సారి వేలాదిగా తరలివచ్చిన భక్తుల సమక్షంలో స్వామివారి కల్యాణం కన్నుల పండువగా సాగింది.
మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ నింబాచలంపై నెలకొన్న లక్ష్మీనారసింహుడి కల్యాణాన్ని శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 9వ తేదీన ప్రారంభంకాగా.. స్వామి వారి వివాహాన్ని వేద పండితులు కన్నుల పండుగగా జరిపించారు. ఆలయ ధర్మకర్త నంబి లింబాద్రి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం ఆస్థాన పండితుడు పెండ్యాల లక్ష్మీప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో వేదపఠ నం, ఆలయ వేద పండితులు నంబి పార్థసారథి, విజయ్‌సారథి, వాసుదేవాచార్యులు, విష్ణు వేద మంత్రోచ్ఛారణలతో దేవీ దేవరుల కల్యాణం ఆద్యాంతం కన్నుల పండువగా సాగింది. స్వామి వారి కల్యాణం తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. మొదటగా గర్భాలయంలోని స్వామివారి మూల విరాట్‌కు శాస్ర్తోక్తంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. మంగళ వాయిద్యాలతో గర్భాలయం నుంచి పూల పల్లకీలో స్వామివారిని కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో భాగంగా మొదట కలశ, విశ్వక్సేన పూజలను నిర్వహించి రక్షాబంధనం చేశారు. శఠ గోపానికి పాద ప్రక్షాళన చేశారు. ఉత్తరాధి పీఠాధిపతి సత్యాత్మ తీర్థస్వామి వారు స్వామికి బహూకరించిన బంగారు తొడుగు ఉన్న శంఖంతో అభిషేకం నిర్వహించారు. వేద మంత్రాలతో కన్యాదానం చేశారు. లక్ష్మీ నారసింహుడు లక్ష్మీ దేవిని కల్యాణ పీఠంపై ఉంచి వేద పఠనాలు, మంగళవాయిద్యాల మధ్య కల్యాణం జరిపించారు. మున్సిపల్ చైర్పర్సన్ మల్లెల రాజశ్రీ లక్ష్మణ్, ఎంపీపీ మహేశ్, జడ్పీటీసీ రవి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ నర్సయ్య, కౌన్సిలర్లు లత, లింగం, నర్సయ్య, గంగాధర్, నాయకులు కన్నె సురేందర్, రమేశ్ పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా నేడు నృసింహ ఏకాక్షరి హావనం, హోమం, బలి ప్రదానం నిర్వహించనున్నారు.
పెరిగిన భక్తుల సందడి..
గత సంవత్సరం కరోనా కారణంగా ఉత్సవాలను సాదాసీదాగా నిర్వహించారు. దీంతో భక్తులు లేకుండానే ఆలయ బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఈ ఏడాది కరోనా తగ్గుముఖం పట్టడంతో గుట్టకు వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతున్నది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి.