వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాల్సిందే..
వీసీలో మంత్రి హరీశ్‌రావు ఆదేశం
నిజామాబాద్ సిటీ/కామారెడ్డి టౌన్, నవంబర్ 13: వ్యాక్సినేషన్లో వందశాతం పూర్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ ఉండాలని, వైద్యశాఖ సిబ్బంది, అధికారులు జవాబుదారీతనంతో పనిచేసి ప్రజలకు ప్రభుత్వ దవాఖానలపై నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ఉందని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు కలెక్టర్, అధికారులకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ నుంచి శనివారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా వైద్యశాఖ సమీక్షలో భాగంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 85శాతం మొదటి డోస్ పూర్తయ్యిందని, కలెక్టర్ రెగ్యులర్‌గా దవాఖానల పనితీరుపై సమీక్ష నిర్వహించి దవాఖానలో అందిస్తున్న సేవలను పర్యవేక్షించాలన్నారు. ఆక్సిజన్ ప్లాంట్లపై దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వ దవాఖానలో సీటీస్కాన్, డయాగ్నస్టిక్ సౌకర్యాలు ఏర్పాటు చేసినా ప్రజలు బయటికి ఎందుకు వెళ్తున్నారో పరిశీలన చేయాలని అన్నారు. ప్రతి ఒక్కరూ సమయ పాలన పాటించాలని, ప్రాథమిక వైద్య కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు డాక్టర్లు అందుబాటులో ఉండి సేవలందించాలని, ప్రభుత్వ దవాఖానలో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తే 35శాతం నిధులు వస్తాయని తెలిపారు. అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డి జిల్లా అధికారులతో మాట్లాడారు. వ్యాక్సినేషన్ వివరాలన్నీ కొవిన్ యాప్‌లో నమోదు చేయాలని, ప్రతి ఏఎన్ఎం రోజూ 50మందికి తక్కువ కాకుండా వ్యాక్సిన్ వేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల ప్రకారం అన్ని విషయాలు పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ప్రతిరోజూ సాయంత్రం జూమ్ మీటింగ్ ఉంటుందని, ఆ మీటింగ్‌కు అందరూ కూడా వారి పరిధిలో నుంచే హాజరుకావాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉద్యోగంలో నుంచి తొలగిస్తామని, విధులను సక్రమంగా నిర్వహించిన వారికి ప్రశంసా పత్రాలు, అవార్డులు అందజేస్తామని చెప్పారు. నిజామాబాద్ నుంచి మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ చిత్రామిశ్రా, ఇన్చార్జి డీఎంహెచ్‌వో సుదర్శనం, డీపీవో జయసుధ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి నుంచి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, డీఎంహెచ్‌వో డాక్టర్ కల్పన కాంటే, డీపీవో రాజేంద్ర ప్రసాద్, డిప్యూటీ డీహెచ్ఎంవోలు శోభారాణి, చంద్రశేఖర్ పాల్గొన్నారు.